Share News

Panchayat Elections: బీసీ సర్పంచుల రిజర్వేషన్‌కు ఆధారం..2024 కులగణనే

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:21 AM

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు ఎలా ఖరారు...

Panchayat Elections: బీసీ సర్పంచుల రిజర్వేషన్‌కు ఆధారం..2024 కులగణనే

  • ఎస్సీ, ఎస్టీ సర్పంచులకు 2011 జనాభా లెక్కలు ఆధారం

  • వార్డు సభ్యులందరికీ 2024 కులగణనే లెక్క

  • పంచాయతీ ఎన్నికల మార్గదర్శకాల జీవో జారీ

  • మెజారిటీ జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు

  • కేటాయింపులతో నేడు జిల్లాల వారీగా గెజిట్‌లు

  • ముందు ఎస్టీ, తర్వాత ఎస్సీ, బీసీ, జనరల్‌, మహిళ

  • 50ు దాటకుండా పంచాయతీ రిజర్వేషన్లు

  • మహిళలకు అన్ని వర్గాల్లో సమాంతరంగా 50ు

  • రొటేషన్‌ తప్పనిసరి.. అవసరమైతే లాటరీ

  • ఆర్డీవో స్థాయిలో సర్పంచుల రిజర్వేషన్ల ఖరారు

  • వార్డు సభ్యుల రిజర్వేషన్లు తేల్చేది ఎంపీడీవోలు

  • పంచాయతీ పోరుకు ప్రధాన పార్టీలు సై

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు ఎలా ఖరారు చేయాలన్న దానిపై విధివిధానాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో(నెంబరు 46) జారీచేసింది. దీనిపై ఇప్పటికే ఒక దఫా కసరత్తు చేసిన జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు తక్షణమే జీవోకు అనుగుణంగా చకచకా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసేశారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా పెండింగ్‌ ఉన్నవి రేపు పూర్తి చేస్తారు. ఎక్కడైనా రిజర్వేషన్ల ఖరారులో లాటరీ పద్ధతిని అనుసరించాల్సి వస్తే అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే డ్రా తీస్తారు. ఆదివారం రాత్రికల్లారిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

ఆ వెంటనే ఖరారైన రిజర్వేషన్ల వివరాలను పేర్కొంటూ జిల్లాల వారీగా కలెక్టర్లు ఎక్కడికక్కడ గెజిట్‌లు జారీ చేస్తారని సమాచారం. 2018 నాటి పంచాయతీరాజ్‌ చట్టం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే రిజర్వేషన్ల శాతం ఉంటుంది. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా పంచాయతీ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్‌, మహిళ... వరుసగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కేటాయింపునకు అనుసరించాల్సిన విధానాన్ని ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.46లో స్పష్టంగా పేర్కొన్నారు.


ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు (ఎస్టీ, ఎస్సీ, బీసీ) కలిపి 50 శాతం మించకుండా స్థానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లలో రొటేషన్‌ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలంది. అంటే 2019 ఎన్నికల్లో రిజర్వుడుగా ప్రకటించిన వాటిని కాకుండా ఈసారి కొత్త స్థానాలను రిజర్వు చేస్తారు. ఎక్కడైనా ఇలా వీలు కానప్పుడు లాటరీ పద్ధతిన కూడా రిజర్వేషన్లు ఖరారుచేసే వెసులుబాటు పెట్టారు. సర్పంచి స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటారు. బీసీలకు మాత్రం 2024 కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. వార్డు సభ్యుల విషయంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల మొత్తానికి 2024 కులగణన జనాభాను ఆధారంగా తీసుకుని రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు మరింత పారదర్శకంగా, చట్టబద్ధంగా జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ విధంగా రిజర్వేషన్ల అమలుకు వీలుగా పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 9, 17, 146, 147, 175, 176లను సవరించారు.


  • సర్పంచుల రిజర్వేషన్లకు ఎస్టీ, ఎస్సీ, రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కలు, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణన జనాభాను ప్రామాణికంగా తీసుకుంటారు.

  • వార్డు సభ్యుల రిజర్వేషన్‌కు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణన జనాభాను ప్రామాణికంగా తీసుకుంటారు.

  • షెడ్యూల్డ్‌ ఏరియాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 ఎం(1) ప్రకారం పంచాయతీరాజ్‌ చట్టంలోని కొన్ని అంశాలు షెడ్యూల్‌ ప్రాంతాలకు (5వ షెడ్యూల్‌ ప్రాంతాలు) వర్తించవు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఎస్టీలకు మొత్తం సీట్లల్లో సగం కంటే తక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల సర్పంచి పదవులు తప్పనిసరిగా ఎస్టీలకే రిజర్వ్‌ చేస్తారు. ఏ గ్రామ పంచాయతీలోనైతే 100 శాతం జనాభా ఎస్టీలే ఉంటారో ఆ గ్రామ పంచాయతీలోని అన్ని వార్డులు, సర్పంచి పదవులు ఎస్టీలకే కేటాయిస్తారు.

  • మొదట ఎస్టీ జనాభా నిష్పత్తి అత్యధికంగా ఉన్న గ్రామ పంచాయతీలు/వార్డులను గుర్తించి రిజర్వ్‌ చేయాల్సిన సంఖ్య మేరకు స్థానాలను కేటాయిస్తారు. ఎస్టీలకు కేటాయించిన స్థానాలకు మినహాయించి, మిగిలిన స్థానాల్లో ఎస్సీ జనాభా నిష్పత్తి అధికంగా ఉన్న స్థానాలను ఆ వర్గానికి కేటాయిస్తారు. ఇక ఎస్టీ, ఎస్సీలకు కేటాయించిన స్థానాలను పక్కనపెట్టి మిగిలిన స్థానాల్లో బీసీ జనాభా అధికంగా ఉన్న స్థానాల్లో ఆ వర్గాలకు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీలకు రిజర్వ్‌ చేసిన తర్వాత మిగిలిన స్థానాలను అన్‌ రిజర్వ్డ్‌ కేటగిరీగా పరిగణిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, అన్‌-రిజర్వ్డ్‌డ్‌ కేటగిరీలలోని మొత్తం పదవుల్లో సగం మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. గత ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్‌ చేసిన వార్డులు/గ్రామ పంచాయతీలను ఈసారి సాధ్యమైనంత వరకు అదే కేటగిరీకి రిజర్వ్‌ చేయకుండా చూస్తారు. మహిళా రిజర్వేషన్ల సంఖ్య లెక్కింపులో 0.5 కంటే తక్కువ ఫ్రాక్షన్‌ను సున్నా (0)గా పరిగణించాలి. ఉదాహరణకు 3.5 అయితే.. 3గా లెక్కించాలి. ఇలా అవరోహణ కేటాయింపులు చేసిన తర్వాత మిగిలిన వార్డులు/గ్రామపంచాయతీలను మహిళలకు కేటాయించడం కోసం లాటరీ పద్ధతిని అనుసరిస్తారు.


  • గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకుండా జాగ్రత్త వహించాలి. ఇక 2019 ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు అయ్యి ఆ పదవులకు ఎన్నికలు జరగని పక్షంలో ఆ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించవచ్చు.

  • తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 9ప్రకారం వార్డు రిజర్వేషన్లపై ఎంపీడీవో నిర్ణయం తీసుకుంటారు.

  • ఇక సెక్షన్‌ 17 ప్రకారం రెవెన్యూ డివిజనల్‌ అధికారి(ఆర్డీవో) సర్పంచి పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. వార్డుల మాదిరిగానే జనాభా నిష్పత్తి ప్రకారం గ్రామ పంచాయతీలను అవరోహణ క్రమంలో గుర్తిస్తారు. గత ఎన్నికల్లో రిజర్వ్‌ అయిన స్థానాలను మినహాయించి ఆయా కేటగిరీ రిజర్వేషన్ల సంఖ్య పూర్తయ్యే వరకు రొటేషన్‌ పద్ధతిలో కేటాయింపు ఉంటుంది.


నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌

నూతన సమగ్ర మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని డైరెక్టర్‌, రాష్ట్ర ఎన్నికల అథార్టీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అథారిటీలకు(హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలు మినహా) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ సమగ్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపీడీవోలు, ఆర్డీవోలు తమ పరిధిలోని గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల జాబితాలను సిద్దం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్‌ నోటిఫికేషన్లను అధికారికంగా విడుదల చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటారు. అయితే.. ఆదివారం సాయంత్రం గెజిట్‌ విడుదల చేయడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ గెజిట్‌ విడుదలైన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు మార్గం సుగమం అవుతుంది.


ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

Updated Date - Nov 23 , 2025 | 07:19 AM