BC Reservation: బీసీ బిల్లును ఆమోదిస్తారా... రాజీనామా చేస్తారా..
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:44 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్‌ను గవర్నర్ వెంటనే ఆమోదించాలని...
గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం
చలో రాజ్‌భవన్‌లో బీసీ జేఏసీ నాయకులు
పంజాగుట్ట, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్‌ను గవర్నర్ వెంటనే ఆమోదించాలని.. లేకుంటే పదవికి రాజీనామా చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూలులో చేర్చాలనే డిమాండుతో జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ మేధావుల ఫోరం చైర్మన్, టి.చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బి.బాలరాజుగౌడ్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యుగంధర్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్ వెంటనే సంతకం చేసేలా, 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా బీజేపీ రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు గవర్నర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కాగా, చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, సంఘం సభ్యులను పోలీసులు అడ్డుకుని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ ేస్టషన్‌కు తరలించారు.