Mahesh Goud: రాహుల్ ఆశయం మేరకు భవిష్యత్తులో బీసీ సీఎం
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:01 AM
క్షిణాది రాష్ట్రాలన్నింటిలో బీసీ నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారని..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఏ బీసీ నేత కాలేదు
బీసీ రిజర్వేషన్లపై కిషన్‌రెడ్డి తికమక: మహేశ్ గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో బీసీ నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారని.. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క బీసీ కూడా సీఎం కాలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ ఆశయాల మేరకు భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీలు సీఎం అవుతారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా మహేశ్ గౌడ్ హాజరై మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ నేతలు.. ఢిల్లీలో మాత్రం ముఖం చాటేశారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తికమక పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని స్పష్టం చేశారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌లో కల్లు కాంపౌండ్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కల్లు కాంపౌండ్లకు సంబంధించి తాటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని చెప్పారు.