Share News

BC CM for Telangana Soon: రాష్ట్రంలో బీసీ సీఎం ఖాయం

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:05 AM

తెలంగాణలో ఏదో ఒక రోజు బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు

BC CM for Telangana Soon: రాష్ట్రంలో బీసీ సీఎం ఖాయం

  • కాంగ్రెస్‌ హయాంలోనే అది సాధ్యం

  • రేవంత్‌ పదేళ్లు సీఎంననడం తప్పుకాదు

  • ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే ఆ వ్యాఖ్యలు

  • 23 తర్వాత మళ్లీ జనహిత పాదయాత్ర

  • బీసీల నుంచి కిషన్‌రెడ్డి 2 పదవులు లాక్కున్నారు.. బండి, ఈటల నోరు విప్పాలి

  • మీడియాతో పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఏదో ఒక రోజు బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఆ కల సాకారం కాంగ్రె్‌సతోనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంతో సత్సంబంధాలు ఉండటం వల్లే రిజర్వేషన్లపై సమన్వయంతో పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి చెప్పడంలో తప్పు లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచడం కోసం అలా మాట్లాడారని అన్నారు. రేవంత్‌రెడ్డి గతంతో పోలిస్తే ముఖ్యమంత్రి అయ్యాక చాలా మారారని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేర్వేరని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ కోసమే బండిని తొలగించారు

నాలుగైదు రోజుల్లో పార్టీ రాజకీయ సలహా సంఘం(పీఏసీ) సమావేశం ఉంటుందని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు సాగాలన్నది అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో మాత్రం దాన్ని పాస్‌ చేయనివ్వడం లేదని విమర్శించారు. కిషన్‌రెడ్డి భయంతోనే బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, అరవింద్‌ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడటం లేదన్నారు. వారి మౌనం బీసీలకు నష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. గుజరాత్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లపై కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌సతో కుదిరిన ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని, సికింద్రాబాద్‌ ఎంపీ టిక్కెట్‌ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీల నుంచి కిషన్‌రెడ్డి లాక్కున్నారని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ కేసులన్నీ ప్రతిపక్షాల పైనే పెడుతున్నారన్నారు. ఒకే వ్యక్తికి నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండడం దేశంలో ఎన్నికల వ్యవస్థలో నెలకొన్న పరిస్థితికి నిదర్శనమని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ పేరిట పెద్ద ఎత్తున ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.


పాదయాత్ర నాదే

ఆగస్టు 23 తర్వాత మళ్ళీ జనహిత పాదయాత్ర మొదలు పెడతామన్నారు. పాదయాత్ర తన నిర్ణయమని, కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేశారని చెప్పారు. మొదట బస్సు యాత్ర అనుకున్నామని, తర్వాత పాదయాత్రగా మార్చామని వివరించారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు సైతం మధ్యలో పాల్గొంటారని చెప్పారు. భారత్‌ జోడో యాత్రను తలపించేలా తమ పాదయాత్ర సాగుతోందన్నారు. యాత్రలో కొత్త పెన్షన్‌లు ఇవ్వాలనే విజ్ణప్తులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు.

త్వరలో పదవుల పంపకం

పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. పార్టీలో పదవుల భర్తీపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే ప్రకటన ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతోందని వెల్లడించారు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని కేసీఆరే బ్రేక్‌ చేశారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 04:05 AM