Bathukamma Kunta: నిండు కుండలా బతుకమ్మ కుంట..
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:01 AM
చూస్తున్నారా.. ఈ రెండు ఫొటోల్లో ఎంత తేడా ఉందో నివాస సముదాయాల మధ్య కనిపిస్తున్న ఈ ఖాళీ స్థలం ఒకప్పుడు చెరువు..
ముళ్లచెట్లు, చెత్తాచెదారం, మట్టి దిబ్బలు మాయం.. మునుపటి రూపునకొచ్చిన బతుకమ్మ కుంట
ప్రాణం పోసిన హైడ్రా.. కొనసాగుతున్న పనులు
బతుకమ్మల నిమజ్జనం వరకు చెరువు సిద్ధం
మునుపు 14 ఎకరాల్లో.. కబ్జాలతో 5.15 ఎకరాలే మిగిలాయి
హైదరాబాద్ సిటీ, జులై8 (ఆంధ్రజ్యోతి): చూస్తున్నారా.. ఈ రెండు ఫొటోల్లో ఎంత తేడా ఉందో! నివాస సముదాయాల మధ్య కనిపిస్తున్న ఈ ఖాళీ స్థలం ఒకప్పుడు చెరువు! దాని పేరు బతుకమ్మ కుంట! ముళ్ల చెట్లు, చెత్తాచెదారం, మట్టిదిబ్బలు, నిర్మాణాల తాలూకు వ్యర్థాలతో నిండి ఉన్న రోజుల్లో అక్కడ చెరువు ఉందని చెబితే ఎవరూ నమ్మేవారు కాదు. రెండో ఫొటోలో.. చుట్టూ కంచె, కాలి నడక కోసం బాట, కోతకు గురవ్వకుండా చేసిన రివిట్‌మెంట్ మధ్య నిండుగా నీళ్లతో కళకళలాడుతోంది బతుకమ్మ చెరువే!! కేవలం నాలుగంటే నాలుగు నెలల్లోనే ఈ చెరువును ఇలా పునరుద్ధరించారు. ఈ క్రెడిట్ అంతా హైడ్రాదే.

హైదరాబాద్ జిల్లా అంబర్‌పేట మండలం బాగ్ అంబర్‌పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 563లో 14.06 ఎకరాల్లో బతుకమ్మ కుంట ఉన్నట్లుగా 1962-63 నాటి రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. రానురాను చెరువు కబ్జాకు గురై.. 5.15 ఎకరాలే మిగిలాయి. బతుకమ్మ కుంటను బతికించాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూవస్తున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీకి, మంత్రులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. హైడ్రా ఏర్పాటయ్యాక కమిషనర్ రంగనాథ్‌ను కలిసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని కోరారు. రంగనాథ్, బతుకమ్మ కుంటను సందర్శించి, దానిని సుందరీకరించాలని నిర్ణయించారు. కుంట తాలూకు స్థలం తనదేనంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ పొందారు. హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులు సర్వే నంబర్ 563లోని రికార్డులను పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం భూమిపై సదరు వ్యక్తికి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బతుకమ్మ కుంటను చెరువుగానే గుర్తించాలని తీర్పు ఇచ్చింది.
ఉబికి వచ్చిన నీరు..
అడ్డంకులు తొలగిపోవడంతో రూ.7 కోట్లు వెచ్చించి బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుల్లో భాగంగా ప్రత్యేక వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం పార్క్, ఓపెన్ జిమ్, బతుకమ్మ ఆడుకోవడానికి వేదిక, పచ్చదనం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఏళ్లుగా పేరుకుపోయిన నిర్మాణాల వ్యర్థాలు, ముళ్ల కంప చెట్లు పూర్తిగా తొలగించారు. అనంతరం మైదానంగా మారిన కుంటలో పూడిక తీత పనులు చేపట్టగా మోకాలి లోతు నుంచే నీరు ఉబికి వచ్చింది. ఆ నీరుతోనే కుంటంతా నిండిపోయింది. ఆ నీరు డ్రైనేజీ నీరు కాదని, భూగర్భ జలమేనని వాటర్‌బోర్డు అధికారులు నిర్ధారించారు. బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు వీలుగా.. రానున్న సెప్టెంబరు వరకు బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని హైడ్రా అధికారులు ప్రకటించారు.
ఇవీ చదవండి:
ముర్ము.. ముర్మా కోవింద్.. కోవిడ్