Cricket Betting: బ్యాంకు బంగారం తాకట్టు పెట్టి క్రికెట్ బెట్టింగ్
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:46 AM
బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగులే బ్యాంకుకు కన్నం వేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఖాతాదారులు తమ అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన 25కిలోల బంగారాన్ని కొల్లగొట్టారు.
ఏకంగా 25 కిలోల పసిడి తాకట్టు
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐ మేనేజర్, క్యాషియర్ నిర్వాకం
నిందితుల వద్ద నుంచి 15 కిలోల బంగారం, రూ.1.61లక్షలు స్వాధీనం
సూత్రధారితోపాటు 44 మంది అరెస్టు
కోల్‌సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగులే బ్యాంకుకు కన్నం వేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఖాతాదారులు తమ అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన 25కిలోల బంగారాన్ని కొల్లగొట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు సాధారణ ఉద్యోగులు కాదు.. చోరి చేసిన వారిలో బ్యాంకు మేనేజర్‌తో పాటు క్యాషియర్ ఉన్నారు. బ్యాంకులో బంగారాన్ని కాజేసి ప్రైవే టు గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని, ఈ సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్‌బీఐలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐ-2 లో నరిగె రవీందర్ క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. అయితే రవీందర్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడి రూ. 40లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఖాతాదారుల బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్ ఎన్నపురెడ్డి మనోహర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీ్‌పతో కలిసి పథకం రచించాడు. బ్యాంకులోని బంగారాన్ని బయటకు తీసి ఓ ప్రైవేట్ గోల్డ్‌లోన్ సంస్థలో పనిచేసే కొంగోండి ధీరజ్, కోదాటి రాజశేఖర్, బొల్లి కిషన్ అనే వ్యక్తులకు ఇచ్చేవాడు. ఈ విధంగా గతేడాది అక్టోబర్ నుంచి బ్యాంకులో 402 మంది పేరిట ఉన్న గోల్డ్ లోన్ ఖాతాల నుంచి 25.17కిలోల బంగారాన్ని బయటకు తీసి పలు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీల్లో తాకట్టు పెట్టారు. వచ్చిన సొమ్మును మొదట ధీరజ్, రాజశేఖర్, కిషన్ అకౌంట్లలో జమ చేసుకునేవారు. అనంతరం కమీషన్ తీసుకుని మిగతా సొమ్మును రవీందర్ ఖాతాకు బదిలీ చేసేవారు. ఈ డబ్బును ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టేవాడు. ఇతడు బెట్టింగ్ పెట్టిన సొమ్మంతా విదేశాలకు మళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
బ్యాంకు ఆర్‌ఎం ఫిర్యాదుతో వెలుగులోకి...
బ్యాంకు ఆడిటింగ్ అధికారులు ఖాతాలను తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో బ్యాంకు రీజినల్ మేనేజర్ చెన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో రవీందర్ అకౌంట్‌లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్యాషియర్ రవీందర్, బ్యాంకు మేనేజర్ మనోహర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీ్‌పతోపాటు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, మేనేజర్లు, బినామీ పేర్లతో చోరీ బంగారాన్ని తాకట్టు పెట్టిన మొత్తం 47మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి 15.23కిలోల బంగారం, రూ 1.61లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.