Bandi Demands CBI Probe: ట్యాపింగ్ కేసులో కవితను విచారించాలి
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:33 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కూతురు కవితను విచారించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ట్యాప్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా?
సిట్ పరిధి పరిమితం.. కేసును సీబీఐకి ఇవ్వాలి
అధికారులపై నమ్మకం ఉంది.. సర్కారుపై లేదు
కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడను
నేను నోటీసులు ఇస్తూ పోతే కేసీఆర్, కేటీఆర్ జీవితాంతం జైల్లోనే ఉంటారు: బండి సంజయ్
కరీంనగర్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కూతురు కవితను విచారించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కవితనే చెప్పారని అన్నారు. శనివారం కరీంనగర్‌లో సంజయ్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను దేవుడి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమని అన్నారు. ట్యాపింగ్ చేయలేదని కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో ప్రమాణం చేసే దమ్ముందా..? అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని హరీశ్‌రావు కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని సంజయ్ తేల్చి చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లీగల్ నోటీసులతో బెదిరించాలనుకుంటున్నారని తెలిపారు. తాను నోటీసులు ఇస్తూ పోతే తండ్రీ కొడుకులిద్దరూ జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చారని సంజయ్ చెప్పారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. కేంద్ర హోం శాఖకు కేసీఆర్ తప్పుడు సమాచారమిచ్చి ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావును నియమించారని తెలిపారు. మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేశారని.. ఆ డేటాతో బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని సంజయ్ మండిపడ్డారు. ఆ డబ్బుల లావాదేవీలు వెలుగులోకి రావాలంటే ఈడీ విచారణతోనే సాధ్యమవుతుందని అన్నారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ ఆధారాలతో సహా వెల్లడించిందని చెప్పారు. జడ్జీలను పిలిచి స్టేట్‌మెంట్ రికార్డు చేసే అధికారం సిట్‌కు ఉందా..? అని ప్రశ్నించారు. సిట్ పరిధి పరిమితమైందని తెలిపారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని అన్నారు. ఆ ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయని, అలాంటప్పుడు సీఎంకు నోటీసులిచ్చి విచారణకు రమ్మని ఆదేశించే సాహసం సిట్ చేయగలదా..? అని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు నేరుగా ఈ అంశంపై విచారణ జరిపే అవకాశం లేదన్నారు. అందుకే తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సిట్ అధికారులపై నమ్మకం ఉంది కాని, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. కేంద్ర హోం శాఖ నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌కు సబంధించి సేకరించిన డేటాను ఏటా జనవరి, జూన్‌లో ధ్వంసం చేయాలని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏళ్ల తరబడి వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి ఆ డేటాను భద్రపరచుకుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓడిపోయాక నవంబరు, డిసెంబరు నెలల్లో ఆ డేటాను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, రోషం ఉంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలన్నారు. ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని సంజయ్ మండిపడ్డారు.
విద్యుత్ కమిషన్ నివేదిక ఏమైంది..?
బీఆర్‌ఎస్ పదేళ్ల అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం రక్షగా నిలుస్తోందని సంజయ్ విమర్శించారు. ఒకరికొకరు అవినీతి, దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను క్యాబినెట్‌లో చర్చించిన రేవంత్ ప్రభుత్వం.. విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ నివేదికను క్యాబినెట్‌లో ఎందుకు చర్చించలేదన్నారు. పెద్దఎత్తున వాటాలు ముట్టినందునే కమిషన్ నివేదిక గురించి పెదవి విప్పడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎ్‌సఏ, విజిలెన్స్, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలు ఇచ్చాయన్నారు. దీనిపై క్యాబినెట్‌లో చర్చ కూడా జరిగిందని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.