MLC Nomination: అజారుద్దీన్‌కు జాక్‌పాట్!
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:58 AM
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌లను ప్రతిపాదిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో అజారుద్దీన్ జాక్‌పాట్ కొట్టినట్లయింది.
అనూహ్యంగా వరించిన ఎమ్మెల్సీ పోస్టు
కలిసి వచ్చిన సమీకరణాలు
మంత్రీ అయ్యే ఛాన్స్!!
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌లను ప్రతిపాదిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో అజారుద్దీన్ జాక్‌పాట్ కొట్టినట్లయింది. హైదరాబాదీ.. ముస్లిం వర్గానికి చెందిన వాడు కావడంతో సమీకరణాలు కలిసి.. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కేందుకూ ఆస్కారం ఉంది. వాస్తవానికి కోదండరాం, అమెరలీఖాన్‌ల ఎమ్మెల్సీ సభ్యత్వాలను సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత.. వారిద్దరినీ తిరిగి ప్రతిపాదించాలా.. లేక వేరే ప్రాధాన్య పదవులు ఇవ్వాలా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో చోటు చేసుకుంది. అయితే ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించినప్పుడు.. కోదండరాంను మరో 15 రోజుల్లో ఎమ్మెల్సీని చేస్తామంటూ ప్రకటించారు. తద్వారా ఆయన విషయంలో గందరగోళానికి తెర దించారు. మంత్రివర్గంలో చోటుతో ముడిపడి ఉండడంతో అమెరలీఖాన్ సీటు విషయంలో పెద్ద ఎత్తున తర్జన భర్జన నడిచింది.
చివరికి పార్టీ అధిష్ఠానం అజారుద్దీన్‌కే ఓటు వేసింది. అమెరలీఖాన్‌ను ఏదైనా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సీటు నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అజారుద్దీన్.. ఉప ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్‌తో పాటుగా డజను మంది నాయకులు అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. ఇంత పోటీ వాతావరణంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడం.. మంత్రివర్గంలో చోటు దక్కేందుకూ అవకాశాలుండడం.. నిజంగా జాక్‌పాటేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.