Share News

Gandhi Hospital: ప్రోటాన్‌ పంప్‌ ప్రక్రియలో పొట్టలో బ్లేడ్ల తొలగింపు

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:47 AM

కుటుంబంలో తగాదాతో క్షణికావేశానికి గురైన ఓ ఆటో డ్రైవర్‌ మింగిన షేవింగ్‌ బ్లేడ్లను ప్రత్యేక చికిత్స (శస్త్ర చికిత్స లేకుండా)తో మల విసర్జనలో బయటకు వచ్చేలా చేశారు గాంధీ ఆస్పత్రి వైద్యులు.

Gandhi Hospital: ప్రోటాన్‌ పంప్‌ ప్రక్రియలో పొట్టలో బ్లేడ్ల తొలగింపు

  • గాంధీ ఆస్పత్రి వైద్యుల ప్రతిభ

  • 3 రోజుల పర్యవేక్షణలో మల విసర్జనలో బ్లేడ్ల బహిర్గతం

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో తగాదాతో క్షణికావేశానికి గురైన ఓ ఆటో డ్రైవర్‌ మింగిన షేవింగ్‌ బ్లేడ్లను ప్రత్యేక చికిత్స (శస్త్ర చికిత్స లేకుండా)తో మల విసర్జనలో బయటకు వచ్చేలా చేశారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. మౌలాలీ హౌసింగ్‌ బోర్డు కాలనీ వాసి మహమ్మద్‌ ఖాజా(37)కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబంలో గొడవతో క్షణికావేశంలో ఖాజా.. 8 షేవింగ్‌ బ్లేడ్లు రెండేసి ముక్కలు చేసి మింగాడు. కొద్ది సేపటికి నొప్పి రావడంతో తాను బతకనని ఏడుస్తుండటంతో భయపడ్డ కుటుంబ సభ్యులు ఈ నెల 16న గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సునీల్‌ కుమార్‌ నేతృత్వంలో వైద్య బృందం ఎక్స్‌రే.. తర్వాత సిటీ స్కాన్‌ తీసి పొట్టలో బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించారు.


తొలుత ఎండోస్కోపీతో వాటిని బయటకు తీయాలని భావించినా.. ఆ ప్రక్రియలో ఇతర అవయవాలకు అపాయం జరిగి రక్తస్రావమైతే ఇబ్బందిగా మారుతుందని నిర్ణయానికొచ్చారు. ఆహారం, నీరు (నిల్‌ ఫర్‌ ఓరల్‌) ఇవ్వకుండా.. ప్రోటాన్‌ పంప్‌ వైద్య ప్రక్రియలో ఇంట్రావీనస్‌ ద్వారా ద్రావణాలు పంపి.. మల విసర్జనలో బ్లేడ్లు బయటకొచ్చేలా చేశారు. తొలి రోజు కొంత భాగం, రెండో రోజు 90ు కిందకు జారిన బ్లేడ్లు.. మూడో రోజు రోగి మల విసర్జనలో పడిపోయాయి. మరోమారు రోగికి ఎక్స్‌రే తీసి బ్లేడ్లు లేవని నిర్దారించుకున్నాక వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. శస్త్ర చికిత్స చేయకుండానే బ్లేడ్లు తొలగించిన వైద్యుల కృషిని అందరూ ప్రశంసించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో ఈ నెల 21(గురువారం) ఆస్పత్రి నుంచి ఆయన్ను డిశ్చార్జీ చేసినట్లు ఆస్పత్రి అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సునీల్‌ శుక్రవారం మీడియాకు చెప్పారు.

Updated Date - Aug 23 , 2025 | 05:47 AM