PM Modi: నేడు 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం
ABN , Publish Date - May 22 , 2025 | 07:12 AM
ప్రధాని మోదీ నేడు 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేషన్లు కూడా ఉన్నాయని తెలియజేసిన ప్రాధాన్యత.
వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వీటిలో తెలంగాణలోని వరంగల్, కరీంనగర్,
బేగంపేట, ఏపీలోని సూళ్లూరుపేట స్టేషన్లు
న్యూఢిల్లీ/బేగంపేట, మే 21(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ స్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషం. ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రైల్వే స్టేషన్ల ముఖద్వారాలు, ప్రధాన భవనాల నిర్మాణం చేపట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, టాయిలెట్లను పునర్నిర్మించారు. సైన్ బోర్డులు బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా, ఈ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో దక్షిణాది రాష్ట్రాలకు చెందినవి 21 మాత్రమే ఉన్నాయి. వీటిలో 9 తమిళనాడువి. తెలంగాణవి 3, ఏపీ 1, కేరళ 2, కర్ణాటక 5, పుదుచ్చేరికి చెందిన ఒక స్టేషన్ ఉంది. 78 రైల్వే స్టేషన్లు ఉత్తరాది రాష్ట్రాలవే కావడం గమనార్హం. వీటిలో అత్యధికంగా యూపీలో 19, గుజరాత్ 18, మహారాష్ట్ర 15, రాజస్థాన్ 8, మధ్యప్రదేశ్ 6, ఛత్తీస్‌గఢ్ లో 5 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని 3, అసోంలోని ఒక రైల్వే స్టేషన్ ఉంది.