ITDA: ఐటీడీఏల్లో అక్రమ డిప్యుటేషన్లు
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:59 AM
ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ఐటీడీఏల పరిఽధిలో ఇలాంటివి ఎక్కువగా జరుగున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం అన్ని రకాల డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లను రద్దు చేసింది. ఎవరికైనా డిప్యుటేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అ ని పేర్కొంది.

గిరిజన ప్రాంతాల్లో పని చేయాల్సిన.. వైద్యులు, సిబ్బంది ఇతర ప్రాంతాలకు
కలెక్టర్, పీవోకు తెలియకుండానే బదిలీ
డీఎంహెచ్‌వోలకు పైసలిచ్చి డిప్యుటేషన్లు
ఏజెన్సీలోనే పనిచేస్తున్నట్లు జీత భత్యాలు
వైద్య సిబ్బంది కొరతతో గిరిజనులకు కష్టం
హైదరాబాద్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఇంటిగ్రేడెట్ ట్రైబల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ(ఐటీడీఏ)ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జిల్లా వైద్యాధికారులు అక్రమ డిప్యుటేషన్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ఐటీడీఏల పరిఽధిలో ఇలాంటివి ఎక్కువగా జరుగున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం అన్ని రకాల డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లను రద్దు చేసింది. ఎవరికైనా డిప్యుటేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అ ని పేర్కొంది. అలాగే జిల్లాల్లో అత్యవసర పరిస్థితుల్లో డిప్యుటేషన్ ఇవ్వాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరి. అయితే ఐటీడీఏ ప్రాంతాల్లో మాత్రం ఐఏఎస్ అధికారి అయిన ప్రాజెక్టు ఆఫీసర్(పీవో), అడిషనల్ డీఎంహెచ్‌వో(ట్రైబల్) అనుమతులు తీసుకోవాలి. కానీ వీరి అనుమతి లేకుండా గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌వోలు ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లపై పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. కలెక్టర్లు, ప్రాజెక్టు అధికారులతో పాటు ప్రజారోగ్య సంచాకులు పట్టించుకోకపోవడంతో అక్రమ డిపుటేషన్లను యఽథేచ్ఛగా ఇచ్చేస్తున్నారు. వైద్య సిబ్బంది స్థాయిని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.30 వేల నుంచి మొదలుకొని రూ.లక్ష వరకు వసూళ్ల పర్వం నడుస్తున్నట్లు ఐటీడీఏ పరిఽధిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది చెబుతున్నారు. తెలంగాణలో భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు, మన్ననూరులో ఐటీడీఏలు ఉన్నాయి. ఒక్కో ఐటీడీఏ పరిధిలో సగటున 25 నుంచి 30 వరకు పీహెచ్‌సీలున్నాయి. పీహెచ్‌సీల్లో వైద్యులు, స్టాఫ్‌నర్స్‌లు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషీయన్లు, ఏఎన్‌ఎమ్‌లు, ఆఫీసు సబార్డినేట్లతో పాటు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. డాక్టర్లు మొదలుకొని ఆఫీసు సబార్డినేట్ల వరకు నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లు ఇస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కేవలం మౌఖిక ఆదేశాలతో కూడా కొందరికి ఇటువంటి వర్క్ ఆర్డర్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
అంతా ఇష్టారాజ్యం...
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 27 వరకు పీహెచ్‌సీలున్నాయి. ఇక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మారుమూల ప్రాంతాల్లోని వైద్యులను వర్క్ ఆర్డర్ పేరుతో జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జూలూరుపాడు పీహెచ్‌సీలో పనిచేసే ఓ మెడికల్ ఆఫీసర్, నర్సాపూర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్, సులానగర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌ను డీఎంహెచ్‌వో కార్యాలయానికి డిప్యుటేషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఓ స్టాఫ్‌నర్స్‌ను కూడా డీఎంహెచ్‌వో ఆఫీసుకు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో స్టాఫ్‌నర్స్‌కు ఏం పని ఉంటుందని అక్కడి వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఇక ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో 32 పీహెచ్‌సీలున్నాయి. ఆ ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లోని ఏడుగురు డాక్టర్లను మైదాన ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై పంపినట్లు తెలుస్తోంది. బజార్‌హత్నూర్ వైద్య అధికారిని తాంసీ పీహెచ్‌సీకి, జరి నుంచి శాంతినగర్‌కు, సైదాపూర్ నుంచి పుత్లీబౌలికి, భీమాపూర్ నుంచి ఇంద్రవెల్లికి, నర్సాపూర్ నుంచి అంకోలికి, గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ టీబీ సెంటర్‌కు వైద్య అధికారులను డిప్యుటేషన్లపై పంపినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఈ పీహెచ్‌సీలన్నీ గిరిజన ప్రాంతాల్లోనివే. అక్కడ పని చేయాల్సిన వైద్యులను గిరిజనేతర ప్రాంతాలకు పంపారు. రికార్డుల్లో వారంతా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్నట్లు చూపుతూ.. అక్కడి వేతనాలు, అదనపు భత్యాలను అందిసున్నారు. గిరిజన ప్రాంతాల్లో పని చేసే వైద్యులు అడిషనల్ హెచ్‌ఆర్‌ఏ, ఏజెన్సీ భత్యాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఆ ప్రాంతాల్లో రెండేళ్లపాటు పని చేస్తే పీజీ ఇన్ సర్వీస్ కోటాకు అర్హులవుతారు. ఇక ఆ ఐటీడీఏ పరిఽధిలో 9 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కూడా డిప్యుటేషన్‌పై పంపారు. అందులో ఒక్కరికే కలెక్టర్ నుంచి అనుమతి ఉంది. 9 మందిలో నలుగురు గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో పనిచేసేవారే. అందులో గుడిహత్నూర్, గాదిగూడ పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేస్తాయి. అక్కడ పనిచేయాల్సిన వారిని డిప్యుటేషన్లపై పంపి.. వారి స్థానాలను ఖాళీగా ఉంచారు. అలాగే స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆఫీస్ సబార్డినేట్లకు కూడా డిప్యుటేషన్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ తతంగం వెనుక డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఏటూరునాగారం ఐటీడీఏ పరిఽధిలో కూడా కొన్ని డిప్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటువంటి డిప్యుటేషన్ల వల్ల గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది లేక ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.