Deworming Campaign: తొలిరోజే 89 శాతం మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రల పంపిణీ
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:17 AM
రాష్ట్ర వ్యాప్తంగా 85,58,366 మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 85,58,366 మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 96 లక్షల మందికి మాత్రలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తొలిరోజే 89ు మందికి మాత్రలు పంపిణీ చేసినట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 9,87,042 మంది చిన్నారులకు పంపిణీ చేయగా, అతి తక్కువగా ములుగులో 67,535 మందికి పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ సెంటర్లలో మాత్రం ట్యాబ్లెట్ల పంపిణీ కొనసాగనున్నది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, తొలిరోజే 85.58 లక్షల మంది చిన్నారులకు ఆల్బండజోల్ పంపిణీ చేసిన ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. మిగిలిన పిల్లలు కూడా తప్పనిసరిగా మాత్ర తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. 1-19 ఏండ్ల పిల్లలకు తప్పనిసరిగా ఆల్బండజోల్ మాత్ర వేయించాలని మరోసారి ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.