Telangana Vision 2047: చైనా, జపాన్ స్థాయి అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:46 AM
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక విధాన పత్రం విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు...
‘తెలంగాణ రైజింగ్’ విధాన పత్రం లక్ష్యమదే..
రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబించేలా రూపొందించాలి
విధానపరమైన స్తంభన ఉండదనే స్పష్టత ఇవ్వాలి
2034 నాటికి ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి
‘తెలంగాణ రైజింగ్’ సదస్సుపై సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ‘తెలంగాణ రైజింగ్-2047’ దార్శనిక విధాన పత్రం (విజన్ డాక్యుమెంట్) ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు వీలుగా స్పష్టమైన రోడ్ మ్యాప్ విధాన పత్రంలో కనిపించాలని ఆదేశించారు. చైనా, జపాన్‌ల స్థాయి అభివృద్ధే లక్ష్యమని స్పష్టంచేశారు. గురువారం నాడు సీఎం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ‘తెలంగాణ రైజింగ్’ విధాన పత్రంపై సమీక్షించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, అజారుద్దీన్, సీతక్క, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా ‘విజన్-2047’కు సిద్ధమవుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (సీయూఆర్‌ఈ), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (పీయూఆర్‌ఈ), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (ఆర్‌ఏఆర్‌ఈ)గా విభజించుకోవాలని సూచించారు. వైద్యారోగ్యం, విద్య, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, వ్యవసాయంతోపాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలో నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విధానపరమైన స్తంభన ఉండదని చాటి చెప్పేలా విధానపత్రం ఉండాలన్నారు.
‘తెలంగాణ రైజింగ్- 2047’ విజన్‌ను చాటేలా..
తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడుల అవకాశాలు, ప్రయోజనాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచే లక్ష్యంతో వచ్చే నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సును నిర్వహించనున్న విషయం తెలిసిందే. విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను వివరించటంతోపాటు వివిధ రూపాల్లో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సదస్సులో ప్రకటించనుంది. ఈ క్రమంలోనే ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ దార్శనిక విధాన పత్రాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabadi Biryani: టాప్-10లో హైదరాబాదీ బిర్యానీ
Maoist Party: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన