Share News

Tummla: యూరియా కోటా తెప్పించండి

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:04 AM

రాష్ట్రానికి నెలవారీ కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తక్కువగా పంపిణీ చేసిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

Tummla: యూరియా కోటా తెప్పించండి

  • జూన్‌ నెలకు 1.71 లక్షల టన్నులకు 67 వేల టన్నులే సరఫరా

  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తుమ్మల లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి నెలవారీ కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తక్కువగా పంపిణీ చేసిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక నెల ముందుగానే సరిపడా యూరియా నిల్వలు రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా... ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదన్నారు.


ఇప్పటికే చాలా సందర్భాల్లో లేఖల ద్వారా కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్లు తెలిపారు. జూన్‌ నెలకు రాష్ట్రానికి 1.71 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేటాయించగా, కేవలం 67 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి కూడా కేటాయించిన దానికంటే 1.21 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేంద్రం తక్కువగా సరఫరా చేసిందని, మొత్తంగా 3 నెలలకుగాను 2.25 లక్షల మెట్రిక్‌ టన్నులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 04:04 AM