Anirudh Gupta: మార్వాడీ, అగర్వాల్‌లకు రక్షణ కల్పించండి
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:37 AM
అమన్‌గల్‌లో మార్వాడీ సమాజంపై విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే ఘటనలపై తక్షణమే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా కోరారు.
విద్వేష ప్రసంగాలు, ఘటనలపై చర్యలు తీసుకోండి
డీజీపీకి అగర్వాల్ సమాజ్ ప్రతినిధుల వినతి
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అమన్‌గల్‌లో మార్వాడీ సమాజంపై విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే ఘటనలపై తక్షణమే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా కోరారు. మార్వాడీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచి, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అగర్వాల్, మార్వాడీ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అగర్వాల్ సమాజ్ ప్రతినిధులు గురువారం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఇటీవల తమ సమాజంలోని సభ్యులను లక్ష్యం చేసుకుని కొన్ని విద్వేషపూరిత ఘటనలు జరిగిన విషయాన్ని ఆయన డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో కొంతమంది మార్వాడీ గోబ్యాక్ అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేశారని, అమన్‌గల్‌లోనూ అదే విధంగా జరిగిందని, ఇక్కడ వీడియోలను వైరల్ చేస్తూ ఆందోళన కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి శక్తులను శిక్షించకుండా వదిలివేస్తే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రతికూల సందేశం వెళ్తుందన్న విషయాన్ని గమనించాలని కోరారు. రెచ్చగొట్టే కంటెంట్‌ను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని కోరారు.