భూదాన్‌పోచంపల్లిలో ఆఫ్రికన్‌ ప్రతినిధులు

ABN , First Publish Date - 2025-05-29T00:24:27+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఆఫ్రికా ఖండంలోని 15 దేశాలకు చెందిన 30మంది ప్రతినిధులు బుధవారం పర్యటించారు.

భూదాన్‌పోచంపల్లిలో ఆఫ్రికన్‌ ప్రతినిధులు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి రూరల్‌ టూరిజం సెంటర్‌ వద్ద ఆఫ్రికన్‌ ప్రతినిధులు

పోచంపల్లి టూరిజం సెంటర్‌ను సందర్శించిన 30మంది ప్రతినిధులు

ఇక్కత్‌ డిజైన్లను పరిశీలించి అబ్బురపడిన యువతులు

ఆఫ్రికన్‌ దేశాలకు పోచంపల్లి ఇక్కత్‌ చీరలను ప్రచారం చేస్తామన్న ప్రతినిధులు

భూదాన్‌పోచంపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఆఫ్రికా ఖండంలోని 15 దేశాలకు చెందిన 30మంది ప్రతినిధులు బుధవారం పర్యటించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆఫ్రికా ఖండంలోని 15 మధ్య పశ్చిమ ఆఫ్రికన్‌ దేశాల 30మంది సోషల్‌ మీడియా, కంటెంట్‌ క్రియేటర్లు పోచంపల్లి పర్యాటక గ్రామాన్ని సందర్శించారు. స్థానిక సాంస్కృతిక కళలతో, మ్యూజిక్‌తో మమేకమయ్యారు. ప్రత్యేకమైన ఇక్కత్‌ చీరల తయారీ విధానాన్ని పర్యాటక మ్యూజియంలోని లీవ్‌ టు క్లాత్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించి చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక్కత్‌ తయారీ విధానాన్ని పరిశీలించిన అతిథులు నూలు వడకడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ‘ఒక్క చీరకు వారం రోజులపాటు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత’ వారి మనస్సును హత్తుకుంది. చీరలపై బిన్న డిజైన్లను గమనించిన అతిఽథుల్లో కొందరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు. అనంతరం వారు పోచంపల్లి ఇక్కత్‌ చీరల తయారీని పరిశీలించారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో చాటుతామన్నారు. మరికొందరు చీరలు కొనుగోలు చేశారు. అనంతరం వారు రామోజీ ఫిలింసిటీకి బయల్దేరి వెళ్లారు.

Updated Date - 2025-05-29T00:24:28+05:30 IST