Disability Pension: 18 ఏళ్లలోపు దివ్యాంగులకూ పింఛను ఇవ్వండి
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:50 AM
దివ్యాంగులైన 18 ఏళ్ల లోపు బాలలకు కూడా దివ్యాంగుల పింఛను ఇవ్వాలని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులైన 18 ఏళ్ల లోపు బాలలకు కూడా దివ్యాంగుల పింఛను ఇవ్వాలని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, దివ్యాంగుల పింఛను కింద ఇచ్చే మొత్తాన్ని రూ.3 వేలకు పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌కు గురువారం ఓ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి కేంద్ర మంత్రిని న్యూఢిల్లీలో కలిసిన అడ్లూరి లక్ష్మణ్ దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఉన్న దివ్యాంగుల పింఛనును రూ.300 నుంచి రూ.3వేలకు పెంచాలని కోరారు. 40 శాతం వైకల్యంతో బాధపడుతున్న వారికి కూడా వికలాంగులకు అందించే ఉచిత పరికరాలను ఇవ్వాలని అడిగారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత దివ్యాంగుల పింఛను మొత్తాన్ని పెంచలేదనే విషయాన్ని లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 18-79 ఏళ్లలోపు వయస్సు ఉన్న దివ్యాంగులకు రూ.300, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 చొప్పున కేంద్రం పింఛనుగా ఇస్తోందని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ రూ.20 లక్షల కోట్లు దాటిందని, వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం 5 శాతం బడ్జెట్ అంటే రూ.లక్ష కోట్లను దివ్యాంగులకు కేటాయించాలని పేర్కొన్నారు. ఆ నిధులను పింఛను మొత్తాన్ని రూ.3 వేలు చేసేందుకు కేటాయించాలని కోరారు. కాగా, ప్రస్తుతం 80 శాతం వైకల్యం ఉన్నవారికే పింఛను ఇస్తున్నారని, కానీ చట్ట ప్రకారం 40 శాతం వైకల్యం ఉన్నవారు కూడా సంక్షేమ పథకాలకు అర్హులని అడ్లూరి చెప్పారు. 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు తెలంగాణలో పింఛను ఇస్తున్నామని, ఉచితంగా పరికరాలు ఇస్తున్నామని కేంద్ర మంత్రికి ఈ సందర్భంగా వివరించారు. వికలాంగులు పుట్టిన వెంటనే వైకల్య ధ్రువీకరణ పత్రం ఇచ్చి రూ.4016 పింఛను ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ పింఛను రూ.6 వేలకు పెంచుతున్నామని, కేంద్రం కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని దివ్యాంగులకు న్యాయం చేయాలని విన్నవించారు.