ఆడించేవారులేక.. ఆటలు సాగక
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:16 PM
ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే ఆటలకు విద్యార్థులు దూరమవుతున్నారు.. ఆసక్తి ఉన్నా ఆడించేవారులేక... సాధన చేయలేక ఉదాసీనంగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొంది. ఏళ్లుగా వ్యాయామ అధ్యాపకుల పోస్టులు భర్తీకాక విద్యార్థులు నష్టపోతున్నారు.
- జూనియర్ కళాశాలల్లో వేధిస్తున్న వ్యాయామ అధ్యాపకుల కొరత
- క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు
ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే ఆటలకు విద్యార్థులు దూరమవుతున్నారు.. ఆసక్తి ఉన్నా ఆడించేవారులేక... సాధన చేయలేక ఉదాసీనంగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొంది. ఏళ్లుగా వ్యాయామ అధ్యాపకుల పోస్టులు భర్తీకాక విద్యార్థులు నష్టపోతున్నారు.
వాంకిడి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పోటీ ప్రపంచం లో రాణించాలంటే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు తదితర అంశాల్లో ప్రతిభ చాటితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందుకు పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు వ్యాయామ ఉపాధ్యాయులు, ఆధ్యాపకులు ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఆయా పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. వ్యాయామ ఆధ్యాపకులను భర్తీ చేయకోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు చదువుతో పాటు క్రీడాస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్నా వ్యాయామ ఆధ్యాపకులు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. తొలసారిగా ఇంటర్ బోర్డు నుంచి వ్యాయామ పరికరాల కొనుగోలుకు ప్రత్యేకంగా ఒక్కో కళాశాలకు రూ. 10 వేలు నిధులు సైతం మంజూరు చేసింది.
- 11 కళాశాలల్లో ఒక్కరు లేరు....
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫీజుల భారం భరించే స్థోమత లేని పేద విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చేరుతున్నారు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 4,180 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ ఆధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో రాణించాలంటే సొంతంగా సాధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్క వ్యాయామ ఆధ్యాపకుడు లేకపోవడం గమనార్హం.
- ఆసక్తి ఉన్నా ప్రోత్సాహం కరువు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధకులే వ్యాయామ ఆధ్యాపకులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో క్రీడల్లో ప్రోత్సహం కరువై క్రమంగా విద్యార్థులకు ఆటలపై ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించే వారికి క్రీడాకోటా కింద రిజర్వేషన్ వర్తింపచేస్తున్నారు. చదువుకు ఇది ఆదనపు అర్హతగా గుర్తిస్తున్నారు. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అవకాశాలను కోల్పొతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించి రాష్ట్రవ్యాప్తంగా పీడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.
- నియామకాలు లేవు...
ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంలేదు. ఏళ్లుగా ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గతంలో వెలువడిన ఉద్యోగ ప్రకటనలో పీడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కొందరు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ ఆగిపోయింది. గతంలో పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి ఇంటర్ కళాశాలల పీడీలుగా పదోన్నతి కల్పించేవారు. ఇదికూడా పదేళ్లుగా నిలిచిపోవడంతో కళాశాలల్లో వ్యాయామ ఆధ్యాపకుల పోస్టు ఉందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
వ్యాయామ ఆధ్యాపకులను నియమించాలి
దుర్గం రిషిత్- విద్యార్థి
ప్రభుత్వ కళాశాలల్లో వ్యాయామ ఆధ్యాపకులు లేక క్రీడలు ఆడలేక పోతున్నాము. ఏళ్ల తరబడి ప్రభుత్వం వ్యాయామ ఆధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడంలేదు. దీంతో కళాశాలల్లో క్రీడలకు దూరమవుతున్నాము. క్రీడల్లో ప్రతిభ ఉన్న కనబర్చిలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే వ్యాయామ ఆధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము..
- కళ్యాణి, డీఐఈవో
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ ఆధ్యాపకుల కొరత ఉంది. ఈ విషయం ప్రభుత్వ పరిగణలోఉంది. ప్రస్తుతం ఆయా కళాశాలల్లో క్రీడలపై అవగాహన ఉన్న అధ్యాపకులతోనే క్రీడలు నిర్వహిస్తున్నాము. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాము.