సర్వే ప్రకారం ’కరకట్టల’ నిర్మాణం జరిగేనా?
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:03 PM
మంచిర్యాల నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు రాళ్లవాగులో చేపట్టిన ‘కరకట్టల’ నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
- మార్కింగ్‌ను వదిలి వాగులోకి వెళ్లేలా ప్లాన్
- తమ భూములను కాపాడేందుకు పలువురి స్కెచ్
- ప్లాన్ మార్చేలా అధికారులపై తీవ్ర ఒత్తిడి
- కొందరికి మేలు చేకూర్చేందుకు రంగం సిద్దం..!
మంచిర్యాల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు రాళ్లవాగులో చేపట్టిన ‘కరకట్టల’ నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో రాళ్లవాగు నీరు నివాస గృహాల్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు కరకట్టల నిర్మాణం అనివార్యం అయింది. నగరంలోని కార్మెల్ స్కూల్ సమీపంలోగల వంతెన నుంచి మొదలుకొని గోదావరి నది వరకు కరకట్ట నిర్మించాలని ప్రతిపాదించారు. గత ఏడాది డిసెంబరులో కరకట్ట నిర్మాణం కోసం ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా రాళ్లవాగు వెంట సర్వే నిర్వహించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు. నిర్మాణ పనులను హైద్రాబాద్‌లోని ఎస్‌ఎల్‌ఆర్ కంపెనీ దక్కించుకోగా, రూ. 255 కోట్ల అంచనా వ్యయంతో వారం రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి.
7.3 కిలో మీటర్ల మేర నిర్మాణం....
ప్రస్తుతానికి రాళ్ల వాగుకు ఎడమ వైపున 7.3 కిలో మీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపడుతున్నారు. వానాకాలంలో రాళ్లవాగు నుంచి సుమారు 60వేల క్యూసెక్కుల వరద గోదావరిలో కలుస్తున్నట్లు అంచనా. ఈ వరదకు తోడు గోదావరి బ్యాక్ వాటర్ కలిసి పట్టణంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కరకట్టను వాగు ఎడమ (రాళ్లపేట) వైపు ఒడ్డు వెంట ఎత్తు, పల్లాల ప్రకారం కనీసం ఐదు నుంచి గరిష్టంగా 14మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. మరోవైపు వాగులోకి వర్షపునీరు ప్రవహించేలా మూడు చోట్ల ఖాళీగా వదిలివేయనున్నారు. కాగా కరకట్ట నిర్మాణ పనులను రెండేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాల్సి ఉంది. కరకట్ట నిర్మాణం పూర్తయితే మంచిర్యాల నగరంలోని రాళ్లపేట, రెడ్డికాలనీ, ఆదిత్య ఎన్‌క్లేవ్, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్, ఎన్టీఆర్ నగర్, తదితర ప్రాంతాలకు ముంపు బాధలు తప్పనున్నాయి.
‘ప్లాన్’కు విరుద్ధంగా పనులు.?
కరకట్ట నిర్మాణంలో సర్వే ఆధారంగా రూపొందించిన ’ప్లాన్’కు విరుద్ధంగా పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కరకట్ట నిర్మాణంలో భాగంగా అధికారులు ‘మార్కింగ్’ చేసిన ప్రకారం పెద్ద మొత్తంలో భూములు రాళ్లవాగులో కలుస్తున్నాయి. వాస్తవంగా ఆ భూములన్నీ రాళ్లవాగుకు చెందినవే కాగా కాలక్రమేణ ఆక్రమణలకు గురయ్యాయి. కరకట్ట నిర్మాణం కోసం అధికారులు సర్వే జరిపినపుడు వర్షాకాలంలో వాగు ప్రవాహం, వరద ఉధృతిని పరిగణలోకి తీసుకున్నారు. వరద ప్రవాహం మేరకు ఎడమ వైపు ఒడ్డు వెంట తొలగించాల్సిన కట్టడాలపై ‘మార్కింగ్’ చేశా రు. ఆ మార్కింగ్ ప్రకారం పెద్ద మొత్తంలో భూములు వాగులోకి వెళ్లనుండగా, భారీ నిర్మాణాలను తొలగించాల్సి వస్తోంది. ప్రస్తుతం కరకట్ట నిర్మాణం ప్రారంభమైనందున భూములు, నిర్మాణాలు కోల్పోకుండా సంబంధీకులు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రాళ్లవాగు ఒడ్డు వెంట పలువురు బడా బాబులకు చెందిన అపార్టుమెంట్లు, భారీ నిర్మాణాలు ఉన్నాయి. సర్వే ప్రకారం మార్కింగ్ ఇచ్చిన విధంగా కరకట్ట నిర్మాణం జరి గితే అవన్నీ తొలగించాల్సి వస్తుంది. కరకట్ట నిర్మాణంతో తమ కట్టడాలకు ముప్పు తప్పేలా ఉండేందుకు బడా బాబులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సంబంధిత అధికారులపై ఒత్తిడి తేవడం ద్వారా ప్లాన్ మార్చేం దుకు స్కెచ్ వేసినట్లు సమాచారం.
వడ్డెర కాలనీ సమీపంలో ’ప్లాన్’లో మార్పులు?
మంచిర్యాల నగరంలోని వడ్డెర కాలనీలో పెద్ద మొత్తంలో నిర్మాణాలు కరకట్ట నిర్మాణంతో తొలగించాల్సి వస్తోంది. ముఖ్యంగా కాలనీ నుంచి వాగులో ప్రవేశించే స్థలం వద్ద ఇరువైపులా కట్టడాలకు అధికారులు మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన విధంగా పరిశీలిస్తే వాగు నుంచి కనీసం 10 మీటర్ల వరకు కట్టడాలు తొలగించాల్సి ఉంటుంది. ఇందులో వడ్డెర కాలనీ మొదలుకొని పాత మంచిర్యాల వంతెన వరకు పదుల సంఖ్యలో భారీ నిర్మాణాలు ఉన్నాయి. అసలు ఆ నిర్మాణాల వల్లే వాగు కు చింకుపోయి వరద కాలనీల్లోకి చేరుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ నిర్మాణాలను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేటు చొప్పున ముట్టజెప్పడం ద్వారా కరకట్ట నిర్మాణం వాగులోకి జరిపేందుకు అధికారులను మచ్చిక చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని సమాచారం. ముందుగా తయారు చేసిన ‘ప్లాన్’లో మార్పులు చేయడం ద్వారా తమ భూములు, కట్టడాలను రక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సర్వే ఆధారంగా మార్కింగ్ చేసిన విధంగా కరకట్ట నిర్మాణం చేపట్టాలని నగర వాసులు కోరుతుండగా, అధికారులు నిబంధనల ప్రకారం ముందుకు సాగుతారా...?లేదా...? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాళ్లవాగు వెం ట కరకట్ట నిర్మాణం చేపట్టడం ద్వారా కాలనీలు ముంపునకు గురికాకుండా కృషిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఈ విషయమై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.