ఏది ముందు?
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:42 PM
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 17వ తేదితో ముగియగా, ఇక మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వంతు వస్తుందని అన్ని పార్టీల్లోనూ ఆశావహులు పోటికి సిద్ధమవుతున్నారు.
- ప్రాదేశికమా...పురపాలికమా...
- మరో పోరుకు ప్రభుత్వం సిద్ధం
- జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, 127 ఎంపీటీసీ స్థానాలు, 15 జడ్పీటీసీ స్థానాలు
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 17వ తేదితో ముగియగా, ఇక మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వంతు వస్తుందని అన్ని పార్టీల్లోనూ ఆశావహులు పోటికి సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించుకోవడంతో రాబోయే ఎన్నికల్లో సైతం అయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు వ్యూహలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన చిన్నచిన్న తప్పులను పునారవృతం కాకుండా రాబోయే ప్రాదేశిక, పురపాలక ఎన్నికల్లో అలా జరగకుండా అన్నిఏర్పాట్లతో సిద్ధమవుతున్నారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా ఇటు పల్లెలు, అటు పట్టణాలు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో గణనీయ బలం చాటుకున్న కాంగ్రెస్‌కు గట్టిపోటి ఇచ్చిన బీఆర్‌ఎస్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. సర్పంచ్ ఎన్నికలు సరే పార్టీ గుర్తులతో నిర్వహించే స్థానిక ఎన్నికల్లో మొదట పురసాలక ఎన్నికలు వస్తాయా? లేక పరిషత్ స్థానిక ఎన్నికలు వస్తాయా అనే విషాయాల్లో ఏదీ స్పష్టంగా తేలనప్పటికి దేనికైన సిద్దమేనంటున్నారు అయా పార్టీల ఆశావహులు. పంచాయతీ ఎన్నికల పోరుకి లక్షలాది రుపాయాలు ఖర్చు చేసిన అభ్యర్థుల లెక్కలను తెప్పించుకుంటూ రానున్న ఎన్నికల్లో తాము ఏ స్థాయిలో ఖర్చు చేయాలో అంచనాలు రుపొందించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరుకు ఇచ్చిన డబ్బుకన్నా పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన గ్రామాల్లో పెట్టిన ఖర్చు ప్రధాన పార్టీల ఆశావహులను కలవరపెడుతుంది. పంచాయతీలోనే రూ. లక్షల్లో పెడితే స్థానిక ఎన్నికల్లో మరింత పెరిగే పరిస్థితి ఉంటుందని కొందరు వెనక్కి తగ్గుతున్న మరికొందరు ఎంతకైన సిద్దమని ముందు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- అధినాయకుల ఆశీస్సుల కోసం ముమ్మర ప్రయత్నం
నూతన సంవత్సర ఆరంభంలోనే మున్సిపాలిటీ అపై ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ సంకేతాలతో జిల్లాలో మళ్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే 127 ఎంపీటీసీ స్థానాలు, 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం జిల్లా అధికార యంత్రాంగం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, నోడల్ అధికారుల నియామకం చేపట్టింది. వీరికి శిక్షణ సైతం పూర్తి చేసింది. ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? లేక రిజర్వేషన్లు మారుతాయా అనేది స్పష్టంగా రాజకీయ పరిశీలకులకు అంతు పట్టడంలేదు. ఏదేమైనా ముందుగా ఏ ఎన్నికలు వచ్చిన బరిలో దిగడానికి సిద్ధమని అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఇప్పటినుంచే తమ అనుచరగణాన్ని పెంచుకుంటూ అధినాయకుల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
రిజర్వేషన్ల కొర్రీతో ఎన్నికలు ఎలా?
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామంది. దీనికి అనేక అడ్డంకులు వచ్చినా పార్టీరహిత పంచాయతీ ఎన్నికల ను తొలుత పూర్తి చేసుకోగలిగింది. ఇదే జోష్‌తో పురపాలక ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు పట్టణ వాసులకు తీపికబురుగా కన్పించింది. మున్సిపాలిటీ ఎన్నికలు ముందుగా జరిగితే రిజర్వేషన్ల సంగతి ఏమిటి అనేది అధికార, ప్రతిపక్ష పార్టీలో ప్రధాన చర్చగా మారింది. మున్సిపాలిటీ కాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముందుగా వచ్చినా రిజర్వేషన్లపై స్పష్టత ఏదో ఒకటి రావాల్సి ఉంటుందని వివిధ పార్టీల నాయకులు అంటున్నారు.