Share News

యూరియా కష్టాలు తీరేదెప్పుడో?

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:43 PM

జిల్లాలో యూరియా కోసం నిరసనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట యూరియా ఇవ్వాలంటూ రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

యూరియా కష్టాలు తీరేదెప్పుడో?
చెన్నూరులో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్‌లో ఉంచిన రైతులు (ఫైల్‌)

- ఆందోళన బాట పట్టిన రైతులు

- రోజుకోచోట వెల్లువెత్తుతున్న నిరసనలు

- సరిపడా నిల్వలు ఉన్నాయంటున్న అధికారులు

మంచిర్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కోసం నిరసనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట యూరియా ఇవ్వాలంటూ రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వానాకాలం సీజన్‌లో వరిసాగుకు సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు చెబుతున్న ప్రకారం జిల్లాలో సాగుకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంటే రైతులు నిరసనలబాట ఎందుకు పడుతున్నారో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. వ్యవసాయశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో యాసంగి సీజన్‌లో యూరియా కొరత తలెత్తలేదు. మార్క్‌ఫెడ్‌తో పాటు ప్రైవేటు మార్కెట్‌లోనూ యూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉండటంతో ఎక్కడ కూడా రైతులు నిరసనలు తెలిపిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే వానాకాలం సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ సాగు ప్రణాళిక రూపొందించినప్పటికీ యూరియా కొరతతో ఆందోళనలు సాగుతుండటం గమనార్హం.

- జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో సాగు...

2024-25 వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో మూడు లక్షల 18వేల 788 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేస్తున్నారు

- ఎరువుల అవసరం ఇలా..

వానాకాలం సీజన్‌కు సంబంధించి పంట సాగు కోసం 28,506 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా, 9,082 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1,740 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ, 2,245 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, 36,500 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు 20,222 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు చేరింది. బుధవారం నాటికి మరో 263 మెట్రిక్‌ టన్నులు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. ఇంకా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మరో 2,995 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండనుంది. విడతల వారీగా జిల్లాకు యూరియా సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

- సకాలంలో సరఫరా కాకపోవడంతోనే...

జిల్లాలోని వానాకాలం సాగుకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ సకాలంలో అందకపోవడంతోనే రైతులు ఆందోళనబాట పడుతున్నట్లు తెలుస్తోంది. స్టాకు వచ్చినప్పుడల్లా ఒకటి, రెండు బస్తాల చొప్పున అందిస్తుండటంతో ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. క్యూ లైన్లలో నిలబడే ఓపికలేక తమకు బదులు చెప్పులను ఉంచుతున్నారు. అలా తమ వంతు వచ్చే వరకు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఓపిక నశించి రోడ్లపైకి చేరి ఆందోళనలకు దిగుతున్నారు. వానాకాలం సాగుకు అవసరమైన యూరియా మొత్తం ఒక్కసారే సరఫరా చేస్తే పలుమార్లు సెంటర్లకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించే అవసరం వచ్చేది కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. యూరియా విడుతల వారీగా సరఫరా అవుతుండటంతో తమ సాగుకు సరిపడా ఇస్తారో...లేదోనన్న సందేహంతో కొందరు రైతులు అవసరం ఉన్న దానికంటే అధికంగా ఒకేసారి తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కొరత ఏర్పడుతున్నట్లు భావిస్తున్నారు. వానాకాలం సాగు పూర్తయ్యే సరికి యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని, రైతులు ఓపికతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

.

Updated Date - Sep 03 , 2025 | 11:43 PM