ధరణి పోర్టల్ రీఫండ్ ఎప్పుడు?
ABN , Publish Date - May 18 , 2025 | 11:35 PM
ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ర్టేషన్లకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి వినియోగదారులు చెల్లించిన రుసుం ఎప్పుడు తిరిగి వస్తుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.
- సంవత్సరాలు గడుస్తున్నా చేతికి అందని స్లాట్ల రద్దు డబ్బులు
- ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన కోట్లాది రూపాయలు
- భూభారతి అమలు నేపథ్యంలో అయోమయం
- ఆందోళన చెందుతున్న వినియోగదారులు
మంచిర్యాల, మే 18 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ర్టేషన్లకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి వినియోగదారులు చెల్లించిన రుసుం ఎప్పుడు తిరిగి వస్తుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. మూడు నాలుగు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో వందలాది మందికి చెందిన కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. చివరిసారిగా 2021-22లో కొంత రీఫండ్ చేసినప్పటికీ స్లాట్లు రద్దు చేసుకున్నవారందరికీ పెద్దమొత్తంలో డబ్బులు రావాల్సి ఉంది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలు చెల్లించిన సొమ్ములను తిరిగి ఇచ్చేందుకు చొరవ చూపకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. గతంలో ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని చెల్లించిన డబ్బుల విషయం కొలిక్కిరాకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. అసలు ధరణి డబ్బులు వస్తాయో, రావోనన్న సందేహాలు నెలకొన్నాయి. భూభారతి అమలులోకి వచ్చిన తరువాత ధరణి పోర్టల్ దాదాపుగా నిలిచిపోయింది. ఆ సమయంలో చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో ఇంత వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌లో స్లాట్లు బుక్ చేసుకున్నారు. ఇందుకు అవసరమైన రుసుమును కూడ చెల్లించారు ఒక్కొ దరఖాస్తుదారుడు రూ. 25వేల నుంచి రూ. 50 వేల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న డబ్బులు కోట్లలోనే ఉంటాయని అంచనా. ఇదిలా ఉండగా భూ సమస్యలు పరిష్కారం కాక చాలామంది స్లాట్లను ఉప సంహరించుకున్నారు. వీరందరికి ప్రభుత్వం డబ్బులను తిరిగి చెల్లించాల్సి ఉంది. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి అమల్లోకి రానుంది. భూ భారతిపై ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో అధికారులు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు.
కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు...
వ్యవసాయ భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ర్టేషన్ కోసం ధరణి పోర్టల్‌లో చెల్లించిన రుసుం వెనక్కి ఇస్తారేమోనన్న ఆశతో వందలాది మంది వినియోగదారులు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు, నాలా కన్వర్షన్ అనుమతులు, విరాసత్ కోసం పేర్ల మార్పిడి, ఇంటి రిజిస్ర్టేషన్లు తదితర వాటి కోసం ధరణిలో స్లాట్‌ను బుక్ చేసుకునేందుకు వారంతా మీ సేవా కేంద్రాల్లో నిర్దేశిత ఫీజులను చెల్లించారు. అయినప్పటికీ వివిధ కారణాలతో స్లాట్లను అధికారులు రద్దు చేయడమో, లేక బుక్ చేసుకున్న వారు ఆయా కారణాల వల్ల స్వయంగా రద్దు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. అలా రద్దు చేసుకున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించిన సొమ్మును తిరిగి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్లాట్ సొమ్ములు తిరిగి రాలేదు. వాటి కోసం దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని రద్దయిన వారికి సొమ్ము చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సంబంధిత అధికారులకు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
- సొమ్ము జమ అయ్యేది ఎప్పుడూ?
స్లాట్ బుక్ చేసుకొని ఆ తరువాత రద్దు చేసుకున్న వారికి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి చలాన డబ్బులు జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. స్లాట్ రుసుం, ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుండగా తిరిగి అక్కడి నుంచి రద్దు చేసుకున్న వినియోగదారులకు అందాల్సి ఉంటుందంటున్నారు. స్లాట్ రద్దయిన వెంటనే సొమ్ము తిరిగి చెల్లించడం విషయంలో రెవెన్యూశాఖకు సంబంధం లేదని దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. ధరణి పోర్టల్ పేరుతో అప్పటి ప్రభుత్వం ఫీజులు వసూలు చేసినప్పటికీ వివిధ కారణాలతో స్లాట్లు రద్దు చేసుకున్న వారికి తిరిగి చెల్లించకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారి ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా ఆ కార్యకలాపాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఆ స్లాట్‌ను రద్దు చేసుకుంటే మాత్రం చెల్లించిన ఫీజు, స్టాంప్ డ్యూటీ విధిగా చెల్లించాలి. ఈ విషయంలో చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది.
తప్పులు దొర్లితే అంతే సంగతులు...?
ధరణి పోర్టల్‌లో ఫీజు చెల్లించిన తరువాత స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో ఒక్క అక్షరం తప్పు దొర్లినా సరిదిద్దే అవకాశం లేకుండాపోయింది. దీంతో చెల్లించిన ఫీజు ఏ ఖాతాల్లోకి వెళ్లింది? ఎవరిని సంప్రదించాలి?, రీఫండ్ డబ్బులు ఇస్తారా? అవి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయా? అసలు బ్యాంక్ ఖాతాలు ఎవరు అడుగుతారు? అన్న సందేహాలు ఉన్నాయి. ధరణి పోర్టల్ రాకముందు వ్యవస్థలో ఏదైనా పొరపాటుగా అక్షర దోషాలు ఉంటే వాటిని సవరించుకునే అవకాశాలు ఉండేది. ధరణి పోర్టల్ వచ్చిన తరువాత సవరణకు అవకాశం లేకుండా పోయింది. ఒక్క చిన్న తప్పు జరిగినా స్లాట్‌కోసం చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి వస్తుందా లేదా అన్న స్పష్టత కూడా లేదు.
- మార్పులు జరిగేనా?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్ తీసుకువచ్చినందున కనీసం అందులోనై సవరణలకు అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ధరణి పోర్టల్ కింద వసూలు చేసి, స్లాట్ రద్దయిన పక్షంలో సొమ్ములు తిరిగి చెల్లించాలని గత ఏడాది డిసెంబరు 13న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే భూ భారతిలోనైన స్లాట్‌ల సొమ్ము తిరిగి చెల్లించే అవకాశం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు. అలాగే తప్పు ఒప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.