సన్నాలకు బోనస్ ఎప్పుడు?
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:23 PM
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ నిలబెట్టుకోవడంలో విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రంలోని సన్నరకం ధాన్యం పండించిన రైతులందరికీ క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉంది.

- రెండు నెలలైనా జమ చేయని ప్రభుత్వం
- యాసంగి సాగు ప్రారంభమైనా చేతికందని నగదు
- కొనుగోలు చేసింది 44వేల మెట్రిక్ టన్నులు
- చెల్లింపులు జరిగింది 20శాతం మాత్రమే
మంచిర్యాల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ నిలబెట్టుకోవడంలో విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రంలోని సన్నరకం ధాన్యం పండించిన రైతులందరికీ క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉంది. దీంతో సీజన్ ముందే వరిసాగు చేస్తే బోనస్ చెల్లిస్తామని ప్రచారం నిర్వహించడంతో జిల్లాలోని రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపారు. అయితే సీజన్ ముగిసి దాదాపు మూడు నెలలైన బోనస్ డబ్బులు పూర్తిస్థాయిలో జమకాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో సన్నరకాన్ని ప్రోత్సహించింది. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాల్సి ఉంది. అయితే యాసంగి సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు బోనస్ చెల్లింపు జరగకపోవడంతో పెట్టుబడి సమయంలో నగదు చేతికందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- 44వేల మెట్రిక్ టన్నుల సేకరణ...
జిల్లావ్యాప్తంగా వానకాలం సీజన్‌లో 7,517 మంది రైతులు సన్న రకం ధాన్యం సాగు చేయగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 44,344 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ఽధాన్యానికి సంబంధించి బోనస్ చెల్లింపులు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి.
- 6,242 మంది రైతులకు అందని బోనస్
వానాకాలం సాగు పంట కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిసెంబరు-జనవరి మాసాల్లో వానాకాలం సాగు పూర్తికాగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నగదు రైతుల ఖాతాల్లో జమకాలేదు. జిల్లా వ్యాప్తంగా డీసీఎంఎస్, డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నరకం ధాన్యం 44,344 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా 7,517 మంది రైతులకు మొత్తం రూ.22.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 4వ తే ది వరకు సన్నరకం ధాన్యానికి సంబంధించిన బోనస్ కేవలం రూ.4.46 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేయగా ఇంకా 6,242 మంది రైతులకు రూ.17.71 కోట్ల చెల్లింపులు జరగాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం చెల్లించింది. 20శాతం బోనస్ మాత్రమే కావడం గమనార్హం. ఇంకా 80శాతం చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి.
- అకౌంట్లు సరిగ్గా లేవనే నెపంతో...
చెల్లింపుల విషయమై సంబంధిత అధికారులను సంప్రదించగా బ్యాంక్ అకౌంట్లు సరిగ్గా ఉన్న రైతులకు చెల్లింపులు జరిగాయని, అకౌంట్‌లో తప్పుల కారణంగా కొంత మొత్తం పెండింగ్‌లో ఉందని సమాధానం ఇస్తున్నారు. అయితే పంట విక్రయించిన తరువాత 15రోజుల్లోగా రైతుల అకౌంట్లలో నగదు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మూడు నెలలు గడిచినా చెల్లింపులు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు యాసంగి సీజన్ కూడ ప్రారంభమైనా బోనస్ చెల్లింపులు జమ చేయకపోవడంతో సాగు పెట్టుబడులకు ఇబ్బంది పడాల్సి వచ్చిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రకటించిన విధంగా వెంటనే బోనస్ డబ్బులు జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
రూ.70వేల బోనస్ రావాల్సి ఉంది
- రాళ్లబండి శ్యాంసుందర్, రైతు, కోటపల్లి
వానాకాలం సాగులో ఎనిమిది ఎకరాల్లో సన్న వడ్లు వేశాను. ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో లబ్ధి జరుగుతుందనే ఉద్దేశంతో సన్నాలవైపు మొగ్గు చూపాను. కొనుగోలు కేంద్రంలో డిసెంబరులో 150 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం విక్రయించాను. రూ. 70వేల బోనస్ రావాల్సి ఉంది. మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా బోనస్ చెల్లించాలి.