పులులకు రక్షణేది?
ABN , Publish Date - May 17 , 2025 | 11:39 PM
అడవికి రాజు పెద్దపులి.. వర్తమానంలో పులికే రక్షణ లేకుండా పోతోంది. పట్టించుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంతోనే పులులు హతమవుతున్నాయనే ఆరోపణలున్నాయి.

- వేటగాళ్ల ఉచ్చుకు ఎల్లూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి
- విచారణ జరుపుతున్న అటవీ శాఖ అధికారులు, అదుపులోకి ఆరుగురు అనుమానితులు
- రింగరేట్ ఘటన మరువక ముందే మరో పెద్దపులి హతం
- వీడని అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం
- ఏడాదిలోనే మూడు పులులు మృతి
కాగజ్‌నగర్, మే 17 (ఆంధ్రజ్యోతి): అడవికి రాజు పెద్దపులి.. వర్తమానంలో పులికే రక్షణ లేకుండా పోతోంది. పట్టించుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంతోనే పులులు హతమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. అటవీ ప్రాంతంలో వేటగాళ్లను పోనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు అటవీ శాఖ అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే పులులు హతమవుతున్నట్టు వన్యప్రేమికులు పేర్కొంటున్నారు. ఈఏడాదిలోనే సిర్పూరు నియోజకవర్గంలో మూడు పులులు హతం కావటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
ఖననం చేసిన కళేబరం పెద్దపులిదే..
రెండురోజుల క్రితం పెంచికల్‌పేట మండలం ఎల్లూరు అటవీ ప్రాంతంలో పెద్దపులిని చంపేసి ఖననం చేసినట్టు వచ్చిన పుకార్లపై అటవీ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి విచారణ చేపట్టి పెద్దపులిని చంపేసినట్టు నిర్ధారణ చేశారు. పెంచికల్‌పేట అటవీ ప్రాంతం సమీపంలో తిరుగుతున్న పులి ఈ నెల 13 వరకు సీసీ కెమెరాలో ట్రాప్ కాగా, 14 నుంచి కన్పించకుండా పోయింది. అప్పటికీ ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు వాకాబు చేసి మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులతో సంప్రదింపులు చేశారు. ఈ నెల 15న పులిని చంపినట్టు, ఖననం చేసినట్టు వచ్చిన పుకార్లపై విచారణ జరుపటంతో వేటగాళ్ల అమర్చిన ఉచ్చుకు బలైనట్టు నిర్ధారణకు వచ్చారు. మృతి చెందిన పులి కళేబారాన్ని బయటికి తీయగా, చర్మాన్ని, గోళ్లను అపహరించుకుపోయారు. ఏడు సంవత్సరాలు వయస్సు ఉన్న ఆడ పులిగా గుర్తించారు. వన్యప్రాణల వేట కోసం ఈ అటవీ ప్రాంతంలో ఉన్న విద్యుత్ వైర్లకు ఉచ్చు బిగించటంతోనే పులి మృతి చెందినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎల్లూరు అటవీ ప్రాంతంలోనే పులి తిరుగుతున్నట్టు సమాచారం ఉండటంతో అధికారులు ఎందుకు పట్టించుకోలేదని.. వీరి నిర్లక్ష్యంతోనే పులి మృత్యువాత పడినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. కాని అటవీ శాఖ అధికారులు మాత్రం తాము కొన్ని నెలల నుంచి విద్యుత్ అధికారులకు పులుల కారిడార్ ప్రాంతానికి విద్యుత్ వైర్లకు ఇన్సులేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాలిచ్చిన కూడా పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. ఇన్సులేషన్ చేస్తే పులి మృత్యువాత పడేది కాదని అటవీ శాఖ అధికారులు వివరణ ఇస్తుండటం విశేషం.
- దరిగాం ఘటనలో రెండు పులులు హతం..
కాగజ్‌నగర్ దరిగాం, రింగరేట్ అటవీ ప్రాంతంలో తరుచూ ఆవులు, మేకల మందపై పులులు దాడులు చేసేవి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తున్నా ఎలాంటి పురోగతి లేక పోవటంతో పలువురు గతేడాది జనవరి 10న విషప్రయోగం చేశారు. ఈ ఘటనలో రెండు పులులు మృత్యవాత పడటంతో రాష్ట్ర అటవీ శాఖ సీరియస్‌గా తీసుకుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి(ఎన్టీసీఏ) బృందం పూర్తి వివరాలు సేకరించి నివేదిక సమర్పించడంతో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై వేటు వేశారు. ముందస్తుగానే అటవీ శాఖ అధికారులు తేరుకుంటే రెండు పులుల ప్రాణులు పోయేవి కావని వన్యప్రాణి ప్రేమికులు పేర్కొంటున్నారు. రెండ్రోజులుగా సిర్పూరు నియోజకవర్గంలో ఉన్న పులులపై కూడా నేషనల్ టైగర్ కనర్వేషన్ అథారిటి బృంద సభ్యులు కూడా విచారణ జరుపుతున్నారు.