అర్హత కలిగిన ప్రతీఒక్కరికి సంక్షేమ ఫలాలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:27 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి భూ భారతి చట్టం అమలు, సన్న బియ్యం పంపిణీ, నకిలీ విత్తనాల అక్రమ రవాణా నివారణ చర్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, అర్హులైన జాబితా రూపకల్పన, వేసవిలో తాగునీటి సరఫరా అంశాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంలోని అంశాలు, హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు రైతులకు మేలు కలిగే విధంగా అప్పీల్ చేసుకునే అవకాశం భూభారతిలో ప్రభుత్వం కల్పించిందన్నారు. విరాసత్, పాలు పంపకాలు, కొనుగోలు పట్టా మార్పిడిలో సంబందీకులకు నోటీసులు జారీ చేసే అవకాశం కల్పించడం ద్వారా పారదర్శకమైన పట్టా మార్పిడికి అవకాశం ఉంటుందని తెలిపారు. భూ భారతి చట్టంపై ఈ నెల 17 నుంచి 30 తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు వివరిస్తామని తెలిపారు.
జిల్లాలోని 314 పౌరసరఫరాల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఇప్పటి వరకు 90 శాతం సన్న బియ్యం పంపిణీ చేశామని, పూర్తి స్థాయిలో చేసేందుకు చర్యలు చేపడుతామని వివరించారు. జిల్లాలో 80 శాతం పత్తి సాగు జరుగుతున్నందున నకిలీ విత్తనాల అక్రమ రవాణా జరగకుండా నకిలీ విత్తనాలు విక్రయించకుండా విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్సై, వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల రవాణా జరగకుండా చూడాలన్నారు. నకిలీ విత్తన వినియోగం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పైలెట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని, విడతల వారీగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. పైలెట్ గ్రామాలే కాకుండా మండలంలోని మిగితా గ్రామాల్లో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల జాబితా రూపొందించేందుకు ఇందిరమ్మ కమిటీల సమన్వయంతో మండలంలోని గెజిటెడ్ స్థాయి అధికారులతో మరొకసారి ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించి అర్హులైన వారి జాబితాను రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
పైపులైన్ మరమ్మతులు చేపట్టి మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరా జరుగుతోందని, పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిరంతరం తాగునీటి అందించేందుకు మంచినీటి బావుల తవ్వకాలకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మిషన్ భగీరథ ఇంజనీర్లు, ఎంపీడీవోలు, కార్యదర్శులు ప్రతి రోజు నీటి సరఫరాపై జిల్లా అదనపు కలెక్టర్ సమీక్షిస్తారని వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్టు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తన విక్రయదారులు నిబంధనల ప్రకారం ప్రభుత్వం గుర్తించడిన రైతులకు అధిక దిగుబడి అందించే విత్తనాలు మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాల నియంత్రణలో సహకరించాలని కోరారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.