నషా ముక్త్ భారత్ నిర్మాణానికి సహకరించాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:19 PM
నషాముక్త్ భారత్ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరమని, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
- రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల క్రైం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నషాముక్త్ భారత్ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరమని, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బంది, సీపీవో సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఇతరులను దూరంగా ఉండేలా చైతన్యం కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువతలో అవగాహన పెంచేందుకు గాను పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని పట్టుకోవడం, మత్తుకు బానిసలుగా మారిన వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించడం, రెహబిలిటేషన్ సెంటర్లకు పంపించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రజలు, యువత సహకారం కీలకమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచి ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏవో శ్రీనివాస్, సీఐ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
- మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
విద్యార్ధులు గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉన్నప్పుడే ఉన్నత లక్ష్యా లను సాధిస్తారని ఎక్సైజ్ సీఐ గురువయ్య అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణం ప్రభుత్వ మెడికల్ కళాశాల, అల్ఫోర్స్, ఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల, వేంపల్లి ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో విద్యారులకు మత్తు పదార్ధాల నిర్మూళనపై అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రసాద్, సౌజన్య, రౌఫ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.