సబ్సిడీ టార్పాలిన్ల కోసం నిరీక్షణ
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:44 PM
ఆరు గాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అరబెట్టుకోవటానికి వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
- అద్దెకు తెచ్చుకుంటున్న రైతులు
- ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కరువు
- పట్టించుకోని ప్రభుత్వం
- ఏటా రైతులకు అవస్థలు
కాగజ్‌నగర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆరు గాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అరబెట్టుకోవటానికి వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు టార్పిలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. దీంతో గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను రైతులకు సరఫరా చేసేది. కానీ ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం టార్పాలిన్ల పంపిణీని నిలిపివేసింది. మార్కెట్‌లో టార్పలిన్ల ధరలు అధికంగా ఉండటంతో టార్పాలిన్లను కొనలేక రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు. వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవటానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై రైతులకు టార్పిలిన్లు అందించేది. మార్కెట్‌లో 2,500 రూపాయలకు లభించే టార్పిలిన్లను 50 శాతం సబ్సిడీతో 1,250 రూపాయలకే ప్రభుత్వం రైతులకు అందించేది. ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే టార్పాలిన్లు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉండేవి. ఈ విధంగా రైతులకు పంపిణీ చేసేది. 2018 నుంచి టార్పాలిన్ల పంపిణీ చేపట్టకపోవటంతో రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గ్రామాలు, పట్టణ శివారుల్లో పలువురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి టార్పాలిన్లు కిరాయిలకు ఇస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో టార్పాలిన్‌కు రోజుకు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవటానికి సాధారణంగా ప్రతీ రైతు కనీసం ఆరు నుంచి 10 టార్పాలిన్లు అవసరం ఉంటుంది. వాటిపై ప్రతీ రోజు అద్దెకు తెచ్చుకోవటంతో భారం పడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లో వరి, కంది, ఇతర అంతర పంటలు సాగు చేసిన రైతులకు ధాన్యం ఆరబెట్టేందుకు తమ పొలాల్లో వీటిని వాడుతారు. రైతుల ప్రయోజనం కోసం ఎంతగానో ఉపయోగపడే టార్పాలిన్లు సబ్సిడీపై పంపిణీ చేయకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను వాకాబు చేస్తే పంపిణీ చేయటం లేదని తెలుపుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోత దశకు రావటంతో రైతులంతా కోత మిషన్లతో వరి పంటను కోయిస్తున్నారు. ఇప్పుడు అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటి..? పంటను ఎలా ఆరబెట్టుకోవాలి..? కనీసం టార్పాలిన్లు సరఫరా చేస్తే తాము ముందస్తుగానే కొనుగోలు చేసుకునే వాళ్లమని ఇప్పుడు దుకాణాల్లో కొనుగోలు చేయాలంటే అదనపు భారం వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. అలాగే ధాన్యం లోడింగ్ చేసిన తర్వాత కూడా పైన కప్పుకునేందుకు సులువుగా ఉండేదని చెబుతున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి రామకృష్ణను వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి సబ్సిడీపై టార్పాలిన్లు పంపిణీ చేయటం లేదన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
- లెండుగురే శ్యాంరావు, బీఆర్‌ఎస్ సిర్పూరు నియోజకవర్గ కన్వీనర్
ప్రభుత్వం రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వెంటనే సబ్సిడీపై టార్పాలిన్లు సరఫరా చేయాలి. రైతులు పంటలు పూర్తిగా పండించారు. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లను సరఫరా చేయాలి. రైతులను ఆదుకోవాలి.