‘గుర్తు’ంటేనే గెలుపు
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:53 PM
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంపై గుర్తులతో పాటు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉంటాయి. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థుల పేర్లు, ఫొటోలు బ్యాలెట్ పత్రాలపై కనిపించవు.
- బ్యాలెట్‌పై కనిపించని అభ్యర్థుల పేర్లు, ఫొటోలు
- దీంతో అభ్యర్థులకు తప్పని గుర్తుల గుబులు
- సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్‌పై నోటా
- నమూనా బ్యాలెట్ పత్రాలతో ప్రచార జోరు
వాంకిడి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంపై గుర్తులతో పాటు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉంటాయి. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థుల పేర్లు, ఫొటోలు బ్యాలెట్ పత్రాలపై కనిపించవు. కేవలం గుర్తులు మాత్రమే ఉంటాయి. ఓటు వేయాలనుకున్న అభ్యర్థి గుర్తు ఏదనేది ఓటర్లు మరిచిపోతే అంతే సంగతి. ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి పడుతుంది. ఫలితంగా అభ్యర్థుల జాతకాలు తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తు ఓటర్లకు గుర్తుండేలా ప్రచారం సాగిస్తున్నారు.
పల్లెల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే తొలి విడత జరిలో నిలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు కేటాయించిన గుర్తులతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం వారికి కేటటాయించిన గుర్తులపైనే ఆధారపడి ఉంది. తమకు కేటాయించిన గుర్తులను ప్రజల మనస్సులో ముద్రపడేలా ఎవరు ప్రచారం చేస్తారో వారికే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. సులువుగా గుర్తుంచుకునే గుర్తులు వచ్చిన అభ్యర్థులకు ఇతర అభ్యర్థులకంటే విజయావకాశాలు ఎక్కువే. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఏవీ బ్యాలెట్ పత్రాలపై ఉండవు. ఒక్క గుర్తులు మాత్రమే ఉంటాయి. పార్టీలకు సంబంధం లేని స్వతంత్ర గుర్తులు మాత్రమే అభ్యర్థులకు కేటాయించారు. ఆయా పార్టీల మద్దతుతో ఈ ఎన్నికలు జరుగుతున్నా బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం పార్టీలకు సంబంధంలేని గుర్తులతోనే ఓటర్ల వద్దకు వెళ్లాల్సిందే. రాష్ట్రఎన్నికల సంఘం సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తుల చొప్పున కేటాయించింది. ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులనే రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులకు కేటాయించారు.
- ఒకే పోలికతో తికమక....
అభ్యర్థులకు తెలుగు అక్షర మాల ప్రకారం గుర్తులు కేటాయించారు. నామినేషన్ల ఉపసంహరణ, ఏకగ్రీవాల అనంతరం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తొలి విడలో ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) లింగాపూర్ మండలాల్లో 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డుస్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యుల్ విడుదలైన తరువాత వ్యక్తిగతంగా ప్రచారం చేసిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులు కేటాయించిన గుర్తులతో ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు తమ గుర్తులను ఓటర్ల మనసులో గుర్తిండిపోయేలా ప్రచారం చేస్తేనే విజయావాకాశాలు ఉంటాయి. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తరువాత తాము ఓటు చేయాలనుకున్న అభ్యర్థి గుర్తు గుర్తుకు రాకపోతే ఎవరికో వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతాయి. ఇదిలా ఉంటే ఒకే పోలికతో పలు గుర్తులు ఓటర్లను తికమక చేసే అవకాశాలు ఉన్నాయి. పలక, నల్లబోర్డు, మంచం ఒకేలాగా ఉండడంతో ఓటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
- అభ్యర్థులకు గుర్తుల గుబులు...
గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. పలుగుర్తులు ఓకే పోలికతో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, వృద్దులు, ఆ గుర్తులను గుర్తుంచుకోవడం కష్టంగానే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. తమకు వచ్చిన గుర్తులను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అభ్యర్థులు కష్టాలు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గుర్తులపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉండడంతో ప్రతీ ఒక్క ఓటరుకు తమ గుర్తు తెలిసేలా ప్రచారం చేస్తున్నారు.
- సోషల్ మీడియాలోనూ ముమ్మరం...
వ్యక్తిగత ప్రచారంతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. హంగూ ఆర్భాటం లేకుండా తమ గ్రామానికి చెందిన ఓటర్లందరికీ తమ గుర్తు చేరేలా వాట్సాప్ గ్రూపూల్లో స్టేటస్‌లు పోస్టు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. తమకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఫోన్లు చేసి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ గుర్తును ముద్రించిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మొదటి విడిత ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లో ప్రచార హోరు వేగం పుంజుకుంది. ఓటర్ల మనస్సుల్లో గుర్తులు బలంగా నిలిచేలా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.