Share News

తగ్గనున్న వాహనాల ధరలు

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:42 PM

కేంద్ర ప్రభుత్వం పలు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో వాహనాల ధరలు సైతం తగ్గనున్నాయి. ఒక్కో వస్తువుపై కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 15 శాతం వరకు జీఎస్టీ తగ్గించడంతో ముఖ్యంగా వాహనాల ధరలు పెద్దమొత్తంలో తగ్గనున్నాయి.

తగ్గనున్న వాహనాల ధరలు

- 10 శాతం జీఎస్టీ తగ్గడంతో దిగిరానున్న రేట్లు

- ఈ నెల 22 తరువాత తగ్గించిన జీఎస్టీ అమల్లోకి

- అప్పటి వరకు వేచి ఉండాలని కస్టమర్ల నిర్ణయం

- ప్రస్తుతం కొనుగోళ్లులేక వెలవెలబోతున్న షో రూములు

- సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం

మంచిర్యాల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పలు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో వాహనాల ధరలు సైతం తగ్గనున్నాయి. ఒక్కో వస్తువుపై కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 15 శాతం వరకు జీఎస్టీ తగ్గించడంతో ముఖ్యంగా వాహనాల ధరలు పెద్దమొత్తంలో తగ్గనున్నాయి. దీంతో కొత్తగా ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేద్దామనుకుంటున్న కస్టమర్లు కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చేదాక వేచి ఉండాలనే నిర్ణయంతో ఉన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం కొనుగోళ్లులేక వివిధ వాహనాల షోరూంలు వెలవెలబోతున్నాయి. ప్రతీ వాహనంపై రెండు శాతం ట్యాక్స్‌ పెంచుతున్నట్టు ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ రోజు నుంచే కొనుగోళ్లపై ప్రభావం కనిపించిందని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు.

- గణనీయంగా తగ్గనున్న ధరలు...

జీఎస్టీ స్లాబుల్లో జరిగిన మార్పులు ఈ నెల 22 తరువాత అమల్లోకి రానుండటంతో వివిధ రకాల వాహనాల ధరల్లో భారీ వ్యత్యాసం ఉండనుంది. కారు, బైకుల ధరలు 10శాతం వరకు తగ్గనున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించనుంది. ప్రతీ ద్విచక్ర వాహనంపై సగటున ఆరు వేల రూపాయలు మొదలుకొని గరిష్టంగా 20,000 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. కార్లపైన 80,000 రూపాయల నుంచి గరిష్టంగా రూ. 1.50లక్షల వరకు తగ్గనున్నాయి. వాహనాల ధరలు భారీ మొత్తంలో తగ్గనుండటంతో వినియోగదారులు ప్రస్తుతం కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. జిల్లాలో ఏడెనిమిది రకాల కార్ల షో రూంలు ఉండగా, 20 వరకు బైక్‌ షోరూంలు ఉన్నాయి. ఆయా షోరూంల్లో వాహనాల కొనుగోళ్లు అధికంగానే ఉంటాయి.

ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో కొనుగోళ్లు గరిష్ట స్థాయికి చేరుతాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని షోరూంల్లో నెలకు సగటున కనీసం కోటి రూపాయల వరకు బిజినెస్‌ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలు అధికంగా వినియోగించే వివిధ రకాల ద్విచక్రవాహనాలపూ జీఎస్టీ 10 శాతం వరకు తగ్గనుండటంతో నిర్ణీత గడువు తరువాత కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉంది. అలాగే మధ్యతరగతి వారు ఉపయోగించే 10 లక్షల రూపాయలలోపు ధరలు గల కార్లపైనా లక్ష రూపాయల వరకు ధరలు తగ్గే అవకాశం ఉండటంతో వాటి కొనుగోళ్లు కూడా అధికంగా ఉంటాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- పాత వాహనాల విక్రయాలపై తీవ్ర ప్రభావం...

జీఎస్టీ కొత్త శ్లాబులు అమలు కానుండటంతో సెకండ్‌ హ్యాండ్‌ వెహికిల్‌ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం పడింది. ద్విచక్రవాహనాల ధరలు కనీసం 10,000 రూపాయల వరకు తగ్గనుండటంతో పాత వాహనాలు కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్న వినియోగదారులు తమ నిర్ణయాన్ని మార్చు కుంటున్నట్లు తెలుస్తోంది. రూ. లక్ష విలువ చేసే కొత్త బైకు సెకండ్‌ హ్యాండ్‌లో 70,000 రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త వాహనం ధర 10,000 మేర తగ్గనుండటంతో మరో 20,000 వెచ్చిస్తే ఏకం గా కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేయవచ్చుననే ఆలోచనతో ఉన్నా రు. అలాగే కార్ల ధరల్లోనూ భారీగా తగ్గింపులు ఉండనుండటంతో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు పూర్తిగా మందగించాయి. 10 లక్షల రూపాయల విలువ చేసే ప్రీమియం వెరైటీ కారు ధరలో తగ్గించిన జీఎస్టీ స్లాబు ప్రకారం 10 శాతం కింద లక్ష రూపాయల వరకు తగ్గనుంది. ఆ స్థాయి సెకండ్‌ హ్యాండ్‌లో ఆరు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల మధ్య లభిస్తుంది. కొత్త కారుపై కనీసం లక్షరూపాయలు తగ్గుముఖం పడు తుండటంతో తొమ్మిది లక్షల్లో లభిస్తుంది. మరో రెండు లక్షల రూపాయలు వెచ్చిస్తే కొత్త వాహనం వస్తున్నందున సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలు ఆలోచనలు విరమించుకుంటున్నారు. ఇలా జీఎస్టీ తగ్గుదలతో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో మార్పులు ప్రకటించినప్పటి నుంచే పాత వాహనాల కొనుగోళ్లు మందగించినట్లు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల విక్రేతలు వాపోతున్నారు.

Updated Date - Sep 10 , 2025 | 11:42 PM