Share News

వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:40 PM

వనమహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు.

వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలి
లక్షెట్టిపేటలో ప్రభుత్వాసుపత్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

లక్షెట్టిపేట, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వనమహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు. బుధవారం లక్షెట్టిపేట మండలంలోని చందారం, దౌడేపల్లి, వెకంట్రావుపేట, కొత్తూర్‌ గ్రామాల్లో మహాత్మగాందీ జాతీయ ఉపాధి హామీ పథకం నర్సరీలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో మొక్కలను నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మండలంలో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఇంటి నిర్మాణం పనులు వేగంగా పూర్తి అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. కార్యక్రమంలో వెంకట్రావుపేట పీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సతీష్‌, ఎంపీడీవో సరోజ, ఈజీఎస్‌ ఏపీవో వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వాసుపత్రి పరిశీలన..

లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వం ఇటీవల నూతనంగా నిర్మాణం చేసి ప్రారంభించిన 30 పడకల ఆసుపత్రిని కలెక్టర్‌ పరిశీలించారు. ఆసుపత్రిలోని పలు వార్డులను తిరుగుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆకుల శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరం అయ్యే మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంట ఆసుపత్రి వైద్యులు కృష్ణ, సురేష్‌, పవిత్ర, స్రవంతిరావు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తిచేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌ (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సీఎస్‌ఆర్‌ నిధుల కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎస్‌ఆర్‌ నిధుల కింద సింగరేణికి సంబంధించి జిల్లాలో చేపట్టిన అభివృద్థి పనులను వేగవంతం చేయాలన్నారు. మరుగు కాలువలు, రహదారులు, చెరువు పూడికలు, వీదిదీపాలు, కమ్యూనిటీ హాల్స్‌ తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి సకాలంలో బిల్లులు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి పూర్ణచందర్‌రావు, సింగరేణి అదికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:40 PM