అకాల వర్షం..కర్షకులకు కష్టం
ABN , Publish Date - May 17 , 2025 | 11:37 PM
మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. హత్తిని, దహెగాం, లగ్గాం, కుంచెవెల్లి, ఒడ్డుగూడ, చంద్రపల్లి, గిరివెల్లి గ్రామల్లోని కర్షకులు నానా తంటలు పడ్డారు.

దహెగాం, మే 17 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. హత్తిని, దహెగాం, లగ్గాం, కుంచెవెల్లి, ఒడ్డుగూడ, చంద్రపల్లి, గిరివెల్లి గ్రామల్లోని కర్షకులు నానా తంటలు పడ్డారు. ఈదురు గాలుల వర్షం గాలి దుమారం ఒకేసారి రావడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యపు రాశులపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయి ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని ఆరబోయడానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఆరబోసిన ధాన్యపు రాశులలో నిలిచిన నీటిని మహిళలు తట్టిలతో తొలగించారు. ధాన్యం బస్తాలపై కప్పిన టార్ఫాలిన్ల్లపై నిలిచిన నీటిని రైతులు తొలగించారు. శనివారం కల్వాడ, దహెగాం, ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీటీ లలిత పరిశీలిం చారు. ఆమె వెంట సిబ్బంది శ్యామూల్, లక్ష్మణ్, ఏఈలు వంశీ, లావణ్య, పీపీసీ ఇన్‌చార్జి జీవన్ తదితరులు ఉన్నారు.
పెంచికలపేట: అకాల వర్షంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎల్కపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యపు రాశులపై కప్పిన టార్పాలిన్ తొలగిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం తరలింపులో అధికారులు జాప్యం కారణంగానే ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన దాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.