Share News

మారని తలరాత

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:30 PM

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామపంచాయతీకి ఈ ఏడాది కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా... గ్రామ సర్పంచ్‌ పదవిని మాత్రం షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేస్తూ వస్తున్నారు.

మారని తలరాత

- ఎన్నికలెరుగని గూడెం గ్రామం

- 30 ఏళ్లకుపైగా పదవులకు నోచుకోని గ్రామస్థులు

- గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్లు

- గిరిజనులు లేకున్నా రిజర్వేషన్లు కేటాయింపు

మంచిర్యాల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామపంచాయతీకి ఈ ఏడాది కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా... గ్రామ సర్పంచ్‌ పదవిని మాత్రం షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేస్తూ వస్తున్నారు. దీంతో మూడు దశాబ్దాలకుపైగా సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలోనే గ్రామం కొనసాగుతోంది.

- నోటిఫైడ్‌ ఏరియాగా ప్రకటించడంతో...

గూడెం గ్రామపంచాయతీలో 1,800 పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. గూడెంలో ఒక్కరు కూడా గిరిజనులు లేకపోయినా 1950లో అప్పటి ప్రభుత్వం గ్రామాన్ని నోటిఫైడ్‌ ఏరియాగా ప్రకటించింది. రిజర్వేషన్‌ ప్రకారం గిరిజనులు ఎవరూ లేకపోవడంతో పోటీ చేసేవారు లేక...అప్పటి నుంచి అ గ్రామంలో ఇన్‌చార్జిల ద్వారా పాలనను కొనసాగిస్తున్నారు. 1987 నుంచి గ్రామ సర్పంచ్‌ స్దానాన్ని సైతం ఎస్టీకి రిజర్వు చేశారు. సర్పంచ్‌ పదవితో పాటు గ్రామంలోని 10 వార్డు సభ్యుల స్థానాల్లో ఐదింటిని ఎస్టీలకు కేటాయించారు. అప్పటి నుంచి సుమారు 38 ఏళ్ల పాటు గూడెం గ్రామపంచాయతీకి సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు లభించడం లేదు. అయినప్పటికీ ప్రతిసారీ పంచాయతీ ఎన్నికల సమయంలో నోటిఫికేషన్‌ విడుదల చేయడం.. నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూలైంది.

- ఆందోళనలు చేసినా ఫలితం శూన్యం...

దశాబ్దాలుగా గూడెం పంచాయతీకి ఎన్నికలు జరుగకపోవడంతో గ్రామస్థులు ఎలాంటి పదవులకూ నోచుకోవడం లేదు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా... రిజర్వేషన్‌ అనుకూలించడం లేదు. గ్రామంలో ఎస్టీ జనాభా లేదని, రిజర్వేషన్‌లో మార్పు చేయాలని గ్రామస్థులు పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. రిజర్వేషన్లు మార్చాలని సామూహిక నిరహర దీక్షలు, రాస్తారోకో, తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకటించడంతో.. కనీసం ఈసారైనా రిజర్వేషన్లు అనుకూలిస్తాయన్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ తిరిగి పాత ప్రకారమే ప్రకటన వెలువడింది.

- గ్రామంలో రిజర్వేషన్లు ఇలా....

గూడెం సర్పంచ్‌ స్థానాన్ని ఎస్టీ జనరల్‌ విభాగానికి కేటాయించారు. గ్రామంలో 10 వార్డులు ఉండగా మొదటి ఐదు వార్డులను షెడ్యూల్డ్‌ తెగలకు కేటాయించగా, మిగిలిన ఐదు వార్డులను జనరల్‌ కేటగిరికి కేటాయించారు. దీంతో సర్పంచ్‌ స్థానంతోపాటు ఐదు వార్డుల స్థానాల్లో అక్కడి ప్రజలకు మళ్లీ నిరాశే ఎదురైంది.

Updated Date - Oct 08 , 2025 | 11:30 PM