నేడే తొలి విడత పోరు
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:29 PM
తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
- పంచాయతీ ఎన్నికలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
- అనంతరం ఓట్ల లెక్కింపు
- నాలుగు మండలాల్లో మొత్తం 90 పంచాయతీలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మంచిర్యాల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడించి, విజేతలను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి పోలింగ్ బూత్‌లకు చేరవేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్ బుధవారం పరిశీలించారు.
ఫ 81 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు...
తొలి విడత పంచాయతీ ఎన్నికలు మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో జరుగనున్నాయి. నియోజకవర్గంలోని హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనుండగా ఆయా మండలాల పరిధిలో మొత్తం 90 సర్పంచ్ స్థానాలు, 816 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. వాటిలో హాజీపూర్ మండలంలో 12 గ్రామ పంచాయతీ (జీపీ)లు ఉండగా, లక్షెట్టిపేట మండలంలో 18 జీపీలు, దండేపల్లి మండలంలో 31 జీపీలు, జన్నారం మండలంలో 29 జీపీలు ఉన్నాయి. సర్పంచ్ స్థానాలకు సంబంధించి దండేపల్లి మండలంలోని 31 జీపీలకు గాను కొండాపూర్, కొత్త మామిడిపల్లి, పాత మామిడిపల్లి, ముత్యంపేట నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే మండలంలోని గూడెం, నెల్కి వెంకటాపూర్ పంచాయతీలు ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వు అయ్యాయి. ఆ గ్రామాల్లో ఎస్టీ ప్రజలు ఎవరూ లేకపోవడంతో సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే మండలంలోని వందురు గూడను విడగొట్టి కొత్త పంచాయతీగా మార్చడాన్ని నిరసిస్తూ ఆ గ్రామంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వందురుగూడలో ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. జన్నారం మండలంలోని 29 జీపీలకు గాను లింగయ్యపల్లి, లోతొర్రె పంచాయతీల్లో కేవలం ఒకేఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆ రెండింటిని ఎన్నికల అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. తొలి విడతలో మొత్తం తొమ్మిది పంచాయతీల్లో ఎన్నికలు జరగకపోగా, మిగిలిన 81 జీపీల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు మండలాల్లో సర్పంచ్ స్థానాలు 81కిగాను మొత్తం 258 మంది పోటీ పడుతున్నారు. అలాగే తొలి విడతలో 816 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా, వాటిలో 306 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 514 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఫ అమలులో 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు....
ఎన్నికలు జరిగే నాలుగు మండలాల పరిధిలో 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు అమలులో ఉండనుంది. ఎన్నికల లెక్కింపు పూర్తికాగానే సాయంత్రం ఐదు గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షల సమయంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం, పోలింగ్ బూత్ నుంచి కిలోమీటర్ పరిధిలో కర్రలు, కత్తులు, తదితర మారణాయుధాలతో సంచరించడం నిషేధం. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడం, సభలు, సమావేశాలు నిర్వహించడం కూడా నిషేధించారు.
ఫ 1.28 లక్షల ఓటర్లు...
తొలి విడతలో ఎన్నికలు జరుగనున్న మంచిర్యాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 1,28,694 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా మండలాల్లో మొత్తం 816 వార్డులు ఉండగా, ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల వారీగా ఓటర్లు ఇలా....
మండలం మొత్తం పురుషులు స్త్రీలు ఇతరులు
దండేపల్లి 42,101 20,486 21614 01
హాజీపూర్ 16,954 8,361 8,593 00
జన్నారం 44,412 21,670 22,740 02
లక్షెట్టిపేట 25,227 12,261 12,966 00