మద్యం టెండర్లకు వేళాయె..
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:19 AM
2025-27 కొత్త మద్యం పాలసీని.. అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఏ-4 లిక్కర్ షాపుల జారీకి ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది.
- 2025-27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి అధికారుల కసరత్తు
- త్వరలోనే టెండర్, లక్కీ డ్రా, తేదీలను ఖరారు చేయనున్న ప్రభుత్వం
- ఈ సారి దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం
- డిసెంబరు 1 నుంచి అమలు కానున్న కొత్త మద్యం పాలసీ
చింతలమానేపల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): 2025-27 కొత్త మద్యం పాలసీని.. అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఏ-4 లిక్కర్ షాపుల జారీకి ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. దీంతో వైన్‌షాపుల టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదివరకే కొనసాగుతున్న 2023-25 మద్యం పాలసీ నవంబరు 30, 2025తో ముగిసిపోనుంది. ఈలోపు ధరఖాస్తులు, టెండర్లు, లక్కీ డ్రా ప్రక్రియను పూర్తిచేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో మొత్తం 32 మద్యం షాపులుండగా.. ఇందులో 28 మైదాన ప్రాంతాల్లో, నాలుగు ఏజెన్సీ పరిధిలో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈసారి కూడా లిక్కర్ వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఒక వ్యక్తి ఎన్ని మద్యం షాపులకైనా దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు ఉంటుంది. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియతో పాటు టెండర్లు, లక్కీడ్రా నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఫ దరఖాస్తు ఫీజు రూ. మూడు లక్షలు..
2025-27 మద్యం పాలసీలో భాగంగా టెండర్ల దరఖాస్తు ఫీజును మూడు లక్షల రూపాయలకు పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 2023-25 మద్యం పాలసీలో లైసెన్సు ఫీజుగా రెండు లక్షల రూపాయలను వసూలు చేశారు. ఈ సారి మరో లక్ష రూపాయలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజును నిర్ణయించారు. ఐదు వేల జనాభా వరకు 50 లక్షల రూపాయలు, ఐదు వేల నుంచి 50 వేల జనాభా ఉన్న షాపులకు 55లక్షల రూపాయలు, 50 వేల నుంచి లక్ష వరకు 60లక్షల రూపాయలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు 65లక్షల రూపాయలు, ఐదు లక్షల నుంచి 20లక్షల జనాభా వరకు 85 లక్షల రూపాయలు, 20 లక్షలకు పైబడిన జనాభా ఉన్న మద్యం షాపులకు కోటి పది లక్షల రూపాయలను లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులని అధికారులు చెబుతున్నారు.
నవంబరు 30 వరకు చివరి గడువు..
ఇప్పటికే మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులకు నవంబరు 30, 2025ను చివరి గడువుగా విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా టెండర్, లక్కీ డ్రా ప్రక్రియను పూర్తి చేసి కొత్తగా ఏ-4 మద్యం దుకాణాలను దక్కించుకున్న వారికి లైసెన్సులు జారీ చేస్తారు. తర్వాత డిసెంబరు 1 నుంచి మద్యం విక్రయాలను అనుమతిస్తారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముందస్తుగా నోటిఫికేషన్ జారీ చేయడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.
రిజర్వేషన్లు యథావిధిగా..:
గతంలో మాదిరిగానే మద్యం షాపుల రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 32 మద్యం షాపులుండగా నాలుగు షాపులు ఏజెన్సీ ప్రాంతంలో అలాగే 28 షాపులు మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మద్యం షాపులు పూర్తిగా ఆదివాసులు, గిరిజనులకు కేటాయిస్తుండగా, 28 షాపులు రిజర్వేషన్ల పద్దతిలో కేటాయిస్తారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. దీని ప్రకారం మైదాన ప్రాంతంలోని మద్యం దుకాణాలకు లక్కీడ్రా నిర్వహిస్తారు. రిజర్వేషన్ల దుకాణాలపై బినామీలు కన్నేసి దక్కించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. చాలా చోట్ల లక్షల రూపాయలు ముట్టజెప్పి లక్కీడ్రాలో గెలుచుకున్న వారి వద్ద బినామీలు లాగేసుకుంటు న్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు..
- జ్యోతి కిరణ్, జిల్లా ఎకై్ౖసజ్ అధికారి
ప్రభుత్వం ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి గెజిట్ విడుదల చేసింది. దరఖాస్తులు, టెండర్లు, లక్కీడ్రా తేదీలు ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది దరఖాస్తు ఫీజు మాత్రం లక్ష రూపాయలు పెంచి మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఒక్క వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ దరఖాస్తుకు మాత్రం మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.