Share News

సర్పంచ్‌ ఎన్నికలకు పోటాపోటీ

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:01 AM

జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికలకు పోటాపోటీ నెలకొంది. గత నెల 25న పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

సర్పంచ్‌ ఎన్నికలకు పోటాపోటీ

- సగటున ఒక్కో స్థానంలో ఆరుగురి పోటీ

- ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ

మంచిర్యాల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికలకు పోటాపోటీ నెలకొంది. గత నెల 25న పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆ మరునాడు నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో గత నెల 27 నుంచి 29 వరకు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మొదటి విడతలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్‌, లక్షెట్టిపేట, దండేపల్లితో పాటు ఖానాపూర్‌ నియోజకవర్గంలోని జన్నారం మండలాల్లో నామినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. అలాగే రెండో విడతలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, తాండూర్‌, నెన్నెల, భీమిని, వేమనపల్లి, కన్నెపల్లి, కాసిపేట మండలాల్లో ఈనెల రెండో తేదీతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మూడో విడతలో చెన్నూర్‌ నియోజకవర్గంలోని చెన్నూర్‌, కోటపల్లి, భీమారం, జైపూర్‌, మందమర్రి మండలాల్లో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీతో నామినేషన్ల పర్వం ముగియనుంది. మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న, రెండో విడతలో 14వ తేదీన, మూడో విడతకు సంబంధించి 17వ తేదీన పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

మొదటి విడతలో 518 నామినేషన్లు..

ఇప్పటి వరకు రెండు విడతల నామినేషన్‌ ప్రక్రియ పూర్తికాగా దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే సర్పంచ్‌ పదవులకే అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. మొదటి విడతలో మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్లలో 90 సర్పంచ్‌ స్థానాలకుగానూ మొత్తం 518 నామినేషన్లు దాఖలయ్యాయి. 816 వార్డు స్థానాలకు గాను 1,749 నామినేషన్‌లు దాఖలయ్యాయి. సర్పంచ్‌ స్థానాల్లో దాదాపు ఆరు రెట్లు అధికంగా నామినేషన్లు దాఖలుకాగా వార్డు మెంబర్లకు రెట్టింపు సంఖ్యలో మాత్రమే నామినేషన్లు రావడం గమనార్హం. రెండో విడత బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 114 సర్పంచ్‌ స్థానాలు ఉండగా గడువు ముగిసే సరికి సర్పంచ్‌ స్థానానికి 758 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే నియోజకవర్గంలో మొత్తం 996 వార్డు మెంబర్ల స్థానాలకు గాను 2,454 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ కూడా సర్పంచ్‌ స్థానానికి దాదాపు ఆరు రెట్లు అధికంగా నామినేషన్లు దాఖలు కాగా వార్డు మెంబర్ల స్థానాలకు రెట్టింపు సంఖ్యలోనే నామినేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు ముగిసిన రెండు విడతల నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్‌ స్థానాలకే డిమాండ్‌ అధికంగా కనిపిస్తోంది.

మూడో విడత నామినేషన్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడో విడత కింద చెన్నూర్‌ నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్‌, మందమర్రి మండలాల్లోని 102 సర్పంచ్‌ స్థానాలు, 868 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక్కడ కూడా సర్పంచ్‌ స్థానాలకే అధిక పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓడితే పరిషత్‌ వైపు...

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌ స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే వారికి ప్రధాన పార్టీల ముఖ్య నాయకుల మద్దతు లభించగా ఎన్నికల్లో సత్తాచాటేందుకు అన్ని అస్ర్తాలను ఉపయోగిస్తున్నారు. రిజర్వేషన్ల వారీగా గెలుపు గుర్రాలకే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు తెలుపగా తమ శాయశక్తుల ప్రయత్నిస్తూ ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఒక వేళ సర్పంచ్‌ ఎన్నికల్లో ఓడినా రాబోయే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లోనైన పైచేయిసాధించాలనే తపనతో అధికశాతం మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందు కోసం ఇప్పటి నుంచే వారు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు సర్పంచ్‌ కాకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీలుగానైనా ఎన్నికవ్వాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం గ్రామాల ప్రజలను తమ వైపు ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ చేపడుతూ వస్తున్నారు. మొత్తంగా ఈసారి ఎన్నికలను మిస్‌ చేసుకోవద్దనే దృఢమైన లక్ష్యంతో అభ్యర్థులు పోటీపడుతుండడం గమనార్హం.

Updated Date - Dec 04 , 2025 | 12:01 AM