Share News

వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి మృతి

ABN , Publish Date - May 17 , 2025 | 11:34 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట ఎల్లూరు అటవీ ప్రాంత సమీపంలో రెండ్రోజుల క్రితం వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు పెద్దపులి మృతి చెందినట్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రాజెక్టు టైగర్‌(ఎఫ్‌డీపీటీ) శాంతరాం ప్రకటించారు.

వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి మృతి
సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న ఎఫ్‌డీపీటీ శాంతరాం

-ఎఫ్‌డీపీటీ శాంతరాం

కాగజ్‌నగర్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట ఎల్లూరు అటవీ ప్రాంత సమీపంలో రెండ్రోజుల క్రితం వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు పెద్దపులి మృతి చెందినట్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రాజెక్టు టైగర్‌(ఎఫ్‌డీపీటీ) శాంతరాం ప్రకటించారు. శనివారం కాగజ్‌నగర్‌ అటవీ డివిజనల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పెంచికల్‌పేట అటవీ ప్రాంతం సమీపంలో తిరుగుతున్న పులి ఈ నెల 13 వరకు సీసీ కెమెరాలో ట్రాక్‌ అయినట్టు తెలిపారు. ఈ నెల 14 నుంచి కన్పించకుండా పోవటంతో తమ సిబ్బంది వాకబు చేస్తుండగా, ఎల్లూరు అటవీ ప్రాంత సమీపంలో ఖననం చేసినట్టు ప్రచారం కావటంతో ఘటన స్థలానికి శుక్రవారం రాత్రి పరిశీలించినట్టు వివరించారు. వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు బలైనట్టు నిర్ధారించామన్నారు. పులి కళేబారాన్ని బయటికి తీయగా ఏడు సంవత్సరాల వయస్సు గల ఆడ పులి కె-8గా ప్రాథమికంగా గుర్తించామన్నారు. చర్మం, వేళ్లను వేటగాళ్లు అపహరించుకుపోయారని తెలిపారు. పులి మృతి చెందిన సంఘటనపై ఇప్పటికే పలువురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. పులి మృతిపై నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటి(ఎన్టీసీఏ) బృంద సభ్యులు కూడా విచారణ జరుపునున్నట్టు తెలిపారు. వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేయడానికి విద్యుత్‌ వినియోగిస్తున్నారని, అటువంటి వైర్లకు ఇన్సులేషన్‌ పెట్టాలని తాము ట్రాన్స్‌కో అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఎఫ్‌డీవో నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:35 PM