Share News

బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:34 PM

బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని పోలీసు అధికారులు తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి
మధుకర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

వేమనపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని పోలీసు అధికారులు తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని నీల్వాయి గ్రామంలో మధుకర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. మధుకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుకర్‌ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నందున ఓర్వలేక ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు కక్షగట్టి తప్పుడు కేసులు బనాయించడం, విచారణ పేరిట పోలీసులు తీవ్ర వేధింపులకు గురి చేయడంతోనే మధుకర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ నాయకుల వేధింపులకు భయపడద్దని, భవిష్యత్‌లో ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా పోరాడి ఎదుర్కోవాలని కోరారు. ఎదురొడ్డి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మధుకర్‌ ఆత్మహత్యకు కారకులైన ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నవారందర్ని పోలీసులు వెంటనే అరెస్టు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తమ కార్యకర్తలకు బీజేపీ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, పార్టీ నాయకులను అన్యాయంగా కాంగ్రెస్‌ నాయకులు వేధిస్తే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇక్కడ నుంచి రామగుండంనకు వెళ్లి సీపీని కలిసి బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతామని తెలిపారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్‌, రాష్ట్ర కార్యదర్శి భరత్‌ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు సీతారాంనాయక్‌, రావు పద్మ, కొయ్యల ఏమాజీ, బీజేపీ జిల్లా అద్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, మాజీ ఎంపీ వెంకటేష్‌ నేత, నాయకులు గోమాస శ్రీనివాస్‌, దుర్గం అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

- బీజేపీనాయకుల మాటల యుద్ధం

మధుకర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన బీజేపీ నాయకుల్లో వర్గపోరు బట్ట బయలైంది. గోమాస శ్రీనివాస్‌, వెంకటేష్‌ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. రాష్ట్ర అద్యక్షుడి వద్ద కూర్చుండేందుకు ఇద్దరు పోటీపడగా ఈ క్రమంలో ఒకరిని ఒకరు ఒకరు ఒరేయ్‌ అంటే ఒరేయ్‌ అంటూ వాగ్వాదానికి దిగారు. వెంకటేష్‌ నేత చెంప పగుల్తది అని అనడంతో గోమాస శ్రీనివాస్‌ బట్టలూడదీసి కొడతానని వెంకటేష్‌ నేతను అన్నాడు. దీంతో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌ కల్పించుకుని ఇరువుర్ని సముదాయించాడు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ విధంగా పరామర్శకు వచ్చి బీజేపీ నాయకులు ఒకరిని ఒకరు దూషించుకోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 14 , 2025 | 11:34 PM