డంప్ యార్డుతో కంపు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:28 PM
కోట్లాది రూపాయల వెచ్చించి నిర్మించిన పాఠశాల/కళాశాల భవనాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
- విద్యార్థుల పాలిట శాపంగా మారిన వైనం
- .రోడ్డుపైనే పశువుల కళేబరాలు.. భరించలేని దుర్వాసన
- చదువులకు ఆటంకం.. అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు
- అఽధ్వాన రోడ్డుతో విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కోట్లాది రూపాయల వెచ్చించి నిర్మించిన పాఠశాల/కళాశాల భవనాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పైగా రోడ్డు బురదమయంగా కావడమే కాకుండా పక్కనే ఉన్న డంపు యార్డు గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి శాపంగా మారింది. ఒక్క వర్షాకాలంలోనే ఇబ్బందులున్నాయనుకుంటే పొరపాటే.. కాలమేదైనా డంపు యార్డుతో తిప్పలు తప్పడం లేదు. విద్యార్థులు, స్కూల్‌కు వచ్చే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిత్యం నరకయాతన పడుతున్నారు.
కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ బలగల సమీపంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చించి భవనాలు నిర్మించినా, రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం వదిలేశారు. దీంతో రోడ్డుపై వెళ్లాంటేనే జంకుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రహదారిపై వెళ్లాలంటేనే రోడ్డు బురదమయంగా అధ్వానంగా ఉండడంతో పాటు పక్కనే డంపు యార్డు ఉండడంతో దుర్వాసన వప్తోందని పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో పాఠశాలకు రూ. 18 కోట్ల నిధులను వెచ్చించాయి. వీటిలో మైనారిటీ బాలురు పాఠశాల/కళాశాల-1, మైనారిటీ బాలురు పాఠశాల/కళాశాల-2కు కేటాయించాయి. సుమారు 600 పైగా విద్యార్థులు చదువుకుంటున్నపటికీ రోడ్డు అధ్వానంగా ఉండడంతో అవస్థలు తప్పడం లేదు. పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకులంలో విద్యనభ్యసిస్తున్నారు. వీరితోపాటు ప్రతీ నిత్యం సుమారు రెండు పాఠశాలకు నుంచి 50 మందికి పైగా ఉపాధ్యాయులు, సిబ్బంది, పేరెంట్స్ వస్తూ పోతుంటారు. దారిలోనే కాగజ్‌నగర్ మున్సిపాలిటీ డంపు యార్డు కూడా ఉండడంతో దుర్వానసమయంగా మారుతోంది. వర్షాకాలంలో ఈగలు, దోమలు క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్‌లోకి వస్తూ ఉండడడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు.
అధిరారులకు ఎన్నిసార్లు విన్నవించినా..
నిత్యం డంపు యార్డుకు తెచ్చే జంతువుల మృత కబేబరాలను కూడా రోడ్డుకు అడ్డంగా పడేస్తుండడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వచ్చే ఉపాఽధ్యాయులు, తల్లిదండ్రులకు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టరుకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. రాత్రి వేళల్లో లైట్లు ఏర్పాటు చేసేందుకు కనీసం విద్యుత్ లైను సౌకర్యం లేదని దీంతో రాత్రి విధులు నిర్వహించే ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. సమీపంలోనే అటవీ ప్రాంతం కూడా ఉండడంతో డంపు యార్డు వద్దకు అడవి కుక్కలు, తోడేళు,్ల ఇతర జంతువులు వస్తున్నాయని భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. మైనారిటీ పాఠశాలల సమీపంలోని డంపుయార్డును అక్కడి నుంచి తొలగించి, రోడ్డు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు.