Share News

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:08 PM

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తున్న రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

జైపూర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. జైపూర్‌ సబ్‌ డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఇందారంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధినిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను సమాజం ఎప్పటికి మర్చిపోదన్నారు. వారి జ్ఞాపకార్ధం ప్రతీ సంవత్సరం పోలీస్‌ ఫ్లాగ్‌ డే నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు చేసే సేవా కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించినప్పుడు పోలీసుల ఉత్సాహం, విశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు. ఎంతోమంది అమరుల త్యాగాలను స్మరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర, దేశ అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి, తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు శాఖ గురించి తెలుసుకోవడానికి ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్లీపర్‌ డాగ్స్‌ వాటి ప్రతిభతో ఆకట్టుకోగా విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. కమిషనరేట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఓపెన్‌ హౌస్‌ విద్యార్థులను ఉత్సాహపరిచింది. అనంతరం రక్తదానం చేసిన వారికి సీపీ ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ఆర్‌ ప్రకాష్‌, పోలీసులు పాల్గొన్నారు.

రక్తదాతలు ప్రాణదాతలతో సమానం

బెల్లంపల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పద్మశాలిభవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఏసీపీ సీఐలతో పాటు పోలీసు సిబ్బంది రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఏటా పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం రక్తదానం చేసిన యువకులు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాసరావు, హనోక్‌, శశిధర్‌ రెడ్డి, దేవయ్యతో పాటు సబ్‌డివిజన్‌లోని ఎస్‌ఐలు, సీఐలు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు సురభి శరత్‌కుమార్‌, అభినవ సంతోష్‌, కాసర్ల శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో మొత్తం 240 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

Updated Date - Oct 29 , 2025 | 11:08 PM