పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్-2 ఆర్‌వోల పాత్ర కీలకం
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:47 PM
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్-2 ఆర్‌వోల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్-2 ఆర్‌వోల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కల్టెర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతితో కలిసి మొదటి, రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓట్లలెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు, వివాదాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణలో ఎన్నికల నిర్వహణ జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. అధికారులు తమకు కేటాయించిన గ్రామపంచాయతీల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి, పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదటగా వార్డు సభ్యుల స్థానాలకు, అనంతరం సర్పంచ్ స్థానానికి ఓట్ల లెక్కింపు చేపట్టి ఉప సర్పంచను ఎన్నుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో ఉపయోగించే సామగ్రి కవర్లు, పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు సక్రమంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కౌంటింగ్ ముందు పీవో డైరీ, బ్యాలెట్ పేపర్, అకౌంట్ పేపర్ సీల్, జోనల్ అధికారులను సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో శాంతిభద్రతలపై పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ఊశన్న, ఆసీఫ్, తదితరులు పాల్గొన్నారు.