పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:36 PM
గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సూచించారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల కమిషనర్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. మూడో విడుతలో నిర్వహించే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీసీ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 335 పంచాయతీలు, 2,874 వార్డు స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యయలు తీసుకుంటున్నామని తెలిపారు. పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. చివరి విడత ఎన్నికల కోసం సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషనల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో మూడు విడతల ఎన్నికల కోసం 87 జోన్లుగా ఏర్పాటు చేశామన్నారు. మండల ప్రత్యేకాధికారులు, జోనల్ అధికారులు, నోడల్ అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, కార్యదర్శులు, పోలీసు శాఖ సమన్వయంతో ఎన్నికల ప్రశాంతంగా జరిగే విధంగా పర్యవేక్షిస్తున్నామని వివరించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.