Share News

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:08 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని మాతా శిశు సంరక్షణ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర సూచించారు.

 సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
కాసిపేట ఆరోగ్య కేంద్రం వద్ద మాట్లాడుతున్న వైద్య బృందం సభ్యులు

- మాతా శిశు సంరక్షణ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర

కాసిపేట, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని మాతా శిశు సంరక్షణ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర సూచించారు. జిల్లాలో మాతాశిశు సంరక్షణ కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా శనివారం కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ డైరెక్టర్‌ సుధీర మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతుందని, గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకురావడంలో ఆరోగ్య, ఆశా కార్యకర్తల పాత్ర ముఖ్యమైందన్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగడం లేదన్నారు. గర్భిణులను వైద్యసిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చూడాలని సూచించారు. జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్‌ కేసులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సీ సెక్షన్‌ ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించారు. మాతా శిశు మరణాలను నివారించేందుకు ఆసుపత్రి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండలంలోని ఉపకేంద్రాల్లో అందిస్తున్న వ్యాక్సినేషన్‌, గర్భవతుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో బృందం సభ్యులు, జాతీయ ఆరోగ్య మిషన్‌ చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ శిల్పారెడ్డి, డాక్టర్‌ విక్రమ్‌, డాక్టర్‌ మనోజ్‌, డీఎంహెచ్‌వో అనిత, డాక్టర్‌ వేదవ్యాస్‌, డాక్టర్‌ భీష్మ, డాక్టర్‌లు ప్రసాద్‌, శ్రీధర్‌, అరుణ, సుధాకర్‌నాయక్‌, రవి, దివ్య, మాస్‌ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

బెల్లంపల్లి (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు మరణాలను తగ్గించాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌, మాతాశిశు సంరక్షణ వైద్యురాలు సుదీర సూచించారు. శనివారం బెల్లంపల్లిలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిని జాతీయ ఆరోగ్యమిషన్‌ చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ పద్మజ, వైద్య సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను పర్యావేక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాక అధికారిణి అనిత, వైద్యులు భీష్మ, శ్రీధర్‌,అరుణ, సుధాకర్‌నాయక్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 11:09 PM