వేధిస్తున్న కూలీల కొరత
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:47 PM
కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పత్తి సేకరణకు కూలీలు దొరకడం లేదు. జిల్లాలో వరి కోతలు...పత్తి ఏరడం ఏకకాలంలో మొదలయ్యాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
- ఏక కాలంలో చేతికి వస్తున్న పత్తి, వరి పంట
- కూలీల కోసం పొరుగు రాష్ట్రాలకు పరుగు
- జిల్లాకు చేరుకుంటున్న వలస కూలీలు
నెన్నెల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పత్తి సేకరణకు కూలీలు దొరకడం లేదు. జిల్లాలో వరి కోతలు...పత్తి ఏరడం ఏకకాలంలో మొదలయ్యాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రైతులను వర్షం భయం వెంటాడుతోంది. పత్తి తడిసి దెబ్బతినక ముందే సేకరించుకునేందుకు రైతులు తొందరపడుతున్నారు. స్థానిక లేబర్ సరిపోక కూలీల కోసం రైతులు పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్నారు. వ్యయ ప్రయసలకోర్చి ఇతర రాష్ట్రాల కూలీలను తీసుకువస్తున్నారు. బ్రోకర్ల సాయంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యాణా, ఢిల్లీ ప్రాంత కూలీలు ప్రత్యేక వాహనాల్లో జిల్లాకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
- రైతులే ఖర్చులు భరించి...
కూలీల డిమాండ్ దృష్ట్య చేసేదేంలేక రైతులు ఖర్చులన్ని భరించి వలస కూలీలను తీసుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలకు, రైతుకు మధ్యవర్తిత్వం వహించే బ్రోకర్‌కు కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో జట్టుకు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు బ్రోకర్ తీసుకుంటున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీల కుటుంబాలు ఇక్కడికి ప్రత్యేక వాహనంలో చేరుకుంటాయి. వాహనం కిరాయి రైతే భరించాల్సి వస్తోంది. దూరాన్ని బట్టి పదివేల రూపయాల నుంచి 15 వేల రూపాయల వరకు వాహనానికి కిరాయి ఉంది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వారికి ముందస్తు ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నారు. పిల్లాపాపలతో ఇక్కడికి చేరుకున్న కూలీలకు బస ఏర్పాటు చేయాల్సి వస్తోంది. గుడారాల ఏర్పాటు, వంట చెరుకులు, కరెంటు, నీటిసౌకర్యాన్ని రైతులే కల్పిస్తున్నారు.
- కూలీలకు ఉపాధి.. రైతులకు ఊరట
జిల్లాకు ప్రతీ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హర్యాణా, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు వస్తారు. వారికి మూడు నెలలు ఉపాధి లభించడంతో పాటు ఇక్కడి రైతులకు కూలీల కొరత తీరుతుంది. వలస వచ్చిన కూలీల కుటుంబాలు గ్రామ శివార్లలో, పెరళ్లలో బస ఏర్పాటు చేసుకొని సూర్యోదయానికి పూర్వమే చేలల్లో పత్తి ఏరడానికి వెళ్తారు. ఒక్కొక్కరు. 80 నుంచి 110 కిలోల పత్తి వరకు సేకరిస్తారు. దీంతో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు గిట్టుబాటవుతుంది. తమ వద్ద పనులు లేక పిల్లా పాపలతో వలస వచ్చామని వారు చెప్పారు. ఇళ్లు గడవక పొట్టచేత పట్టుకొని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చామని తెలిపారు. మూడు నెలలు పని లభిస్తుందని ఒక్కొక్కరు 30 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు సంపాదించుకొని ఇంటికి తీసుకెళ్తామని చెబుతున్నారు.
- వేతనం..ఒప్పందం ప్రకారమే..
స్థానిక కూలీలు క్వింటాలు పత్తి సేకరణకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు. మొదటి దఫాకే క్వింటాలుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తే... 2, 3వ విడతలకు మరింత పెంచుతారని రైతులంటున్నారు. వలస కూలీలు సీజన్ మొదటి నుంచి ఆఖరు వరకు ఒకే ధర తీసుకుంటారు. పత్తి ఎక్కువ తక్కువలున్నప్పటికీ సేకరణకు కిలోకు 10 రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. పత్తిని ట్రాక్టర్‌లో ఇంటికి చేర్చడం, ఇంటి వద్ద నిల్వ చేయడం కూడా వారే చేస్తారు. కూలీలను వాహనాల్లో చేలకు తీసుకెళ్లడం, తిరిగి ఇంటివద్ద రైతులే దిగబెట్టాల్సి ఉంటుంది.
- ఊపందుకుంటున్న సేకరణ పనులు
జిల్లాలో ఏటా అక్టోబరు మొదటి వారం నుంచే పత్తి ఏరడం ప్రారంభిస్తారు. ఈసారి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తుండటంతో చెట్లు పచ్చగానే ఉండి పత్తి కాయలు త్వరగా పగల లేదు. మొదట కాసిన కాయలు మాత్రమే దూదిగా మారాయి. ఈపాటికి రెండో విడత పత్తి సేరించాల్సి ఉండగా ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నా రు. ప్రస్తుతం చలి తీవ్రత పెరిగి పగటి పూట ఎండలు కాస్తుండటంతో మరో వారం పదిరోజుల్లో పత్తి సేకరణ ఊపందుకోనుంది. పూర్తిస్థాయిలో కాయలు పగిలితే కూలీలకు చేతినిండా పని లభిస్తుంది. జనవరి ఆఖరు వరకు ఈసీజన్ కొనసాగుతుందని అంటున్నారు.