Share News

మోగిన ‘స్థానిక’ ఎన్నికల నగారా

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:02 AM

స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు.

మోగిన ‘స్థానిక’ ఎన్నికల నగారా

- షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

- రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

- మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు

- జిల్లాలో 335 జీపీలు, 127 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. జిల్లాలో 335 గ్రామపంచాయతీలు, 127 ఎంపీటీసీ స్థానాలు, 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇదివరకే అధికారులు అయా స్థానాల్లో రిజర్వేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబరు 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనుంది. అలాగే గ్రామ పంచాయతీలకు అక్టోబరు 31న తొలి విడత, నవంబరు 4న రెండో విడత, నవంబరు 8న మూడో విడత ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పోలింగ్‌ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నవంబరు 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ అక్టోబరు 9 నుంచి 11 వరకు ఉంటుంది. రెండో విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబరు 13 నుంచి 15 వరకు ఉంటుంది. అలాగే గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబరు 17నుంచి 19 వరకు, రెండో విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబరు 21 నుంచి 23 వరకు, మూడో విడత అక్టోబరు 25 నుంచి 27 వరకు కొనసాగుతుంది.

సర్పంచ్‌, ఎంపీటీసీల వారీగా రిజర్వేషన్లు:

జిల్లాలో 335 గ్రామపంచాయతీలు ఉండగా వాటి పరిధిలో 2,874 వార్డులు ఉన్నాయి. 15 మండలాల పరిధిలో 127 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అధికారులు జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారు.

కేటగిరి సర్పంచ్‌ వార్డు ఎంపీటీసీ

ఎస్టీ 198 1292 39

ఎస్సీ 32 226 18

బీసీ 67 534 41

జనరల్‌ 38 822 29

------------------------------------------------------------------

మొత్తం 335 2,874 127

------------------------------------------------------------------

Updated Date - Sep 30 , 2025 | 12:02 AM