‘వసతి’ వణుకుతోంది...
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:30 PM
జిల్లాలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. మరికొన్ని రోజులు చలితీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హస్టళ్లు, గురుకులాల్లో చలి తీవ్రతతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. సరిపడా వసతులు లేక అష్టకష్టాలు పడుతున్నారు.
- జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
- చెడిపోయిన సొలార్ ప్లాంట్లు..చన్నీటి స్నానాలు
- సరిపడా వసతులు కరువు
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
- హాస్టళ్లపై ‘ఆంధ్రజ్యోతి’ విజిట్
ఆసిఫాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. మరికొన్ని రోజులు చలితీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హస్టళ్లు, గురుకులాల్లో చలి తీవ్రతతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. సరిపడా వసతులు లేక అష్టకష్టాలు పడుతున్నారు.
కొన్ని హస్టళ్లలో తలుపులు, కిటికిలు, దుప్పట్టు వంటి కనీస సౌకర్యాలులేక చలితీవ్రతకు వణుకుతున్నారు. వసతి గృహాల విద్యార్థులకు వేడి నీళ్లందించేందుకు మంజూరు చేసిన సొలార్ వాటర్ హీటర్లు కొన్నిచోట్ల మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా ఉండటంతో విద్యార్థులు చన్నీటితోనే స్నానాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై ‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌నెట్ వర్క్ హస్టల్ విజిట్ చేపట్టింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, స్థితిగతులు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాల్లో కనీస వసతులు కరువయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఐదు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఐదు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, నాలుగు మహత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలు, మూడు మైనార్టీ గురుకులాలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల, 15 కసూర్బాగాంధీ పాఠశాలలు, రెండు ఆదర్శ పాఠశాలలు, 44 గిరిజన ఆశ్రమ, ఆశ్రమోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా వివిధ సంక్షేమశాఖల కింద వసతిగృహాలు కొనసాగుతున్నాయి. ఇందులో సుమారు 12వేల పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
నేలపైనే నిద్ర..
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వసతి గృహాల్లో చాలా చోట్లా విద్యార్థులు చన్నీటితోనే స్నానాలు చేయాల్సి వస్తోంది. ఉదయాన్నే చలికి వణుకుతూ చల్లని నీటితోనే స్నానాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. జన్కాపూర్ బీసీ వసతి గృహంలో విద్యార్థులు నేలపైనే పడుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గురుకులాలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి ప్రశాంత వాతావరణంలో విద్యనభ్యసించే విధంగా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కొరుతున్నారు.
చన్నీటి స్నానాలే
రెబ్బెన(ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలంలోని గోలేటి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ ప్లాంట్ పని చేయడం లేదు. దీంతో చిన్నారులు కొందరు కట్టెల పొయ్యిపై నీళ్లు వేసి చేసుకుని స్నానం చేస్తున్నప్పటకీ చాలా మంది చన్నీటి స్నానమే చేస్తున్నారు. హస్టల్లో మొత్తం 127 మంది పిల్లలు ఉన్నారు. వారికి ఇటీవలనే దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని, పడుకోవడానికి గదులు సక్రమంగానే ఉన్నాయి.
రగ్గుల పంపిణీ లేదు..
బెజ్జూరు(ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మండలంలోని సోమిని, కుంటలమానేపల్లి, సలుగుపల్లి, బెజ్జూరు గ్రామాల్లో ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. మండల కేంద్రంలోని కేసీబీవీ గురుకులం ఉంది. ఆయా పాఠశాలల్లో ఇప్పటికీ రగ్గులు పంపిణీ చేయడం లేదు. పాఠశాలల్లో సోలార్ వాటర్ హీటర్లు పనిచేయని కారణంగా చన్నీటితో స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు సరిపడ మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌లు పని చేయని కారణంగా తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన వసతులు లేకపోవడంతో సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
మెనూ పాటించడం లేదు..
దహెగాం(ఆంధ్రజ్యోతి): దహెగాం మండలం కల్వాడ ఆశ్రమోన్నత పాఠశాలలో 202 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా సోలార్ వాటర్ హీటర్ చెడిపోవడంతో విద్యార్థులు చన్నీటి స్నానాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు భోజనంలో మెనూ పాటించడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి వార్డెన్ రాకపోకలు సాగిస్తూ సమయపాలన పాటించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యార్థులు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే బాలికలు 284 మంది ఉన్నారు. ఇటీవలే ఈ రెండు పాఠశాలల్లో విద్యార్థుల రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
సరిపడా మూత్రశాలలు కరువు..
పెంచికలపేట(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. మండలంలోని ఎల్లూరు, కమ్మర్‌గాం ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఇప్పటికీ రగ్గులు పంపిణీ చేయడం లేదు. పాఠశాలల్లో సోలార్ వాటర్ హీటర్లు పని చేయని కారణంగా చన్నీటితో స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. సరైన వసతులు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పనిచేయని వాటర్ హీటర్లు..
తిర్యాణి(ఆంధ్రజ్యోతి): తిర్యాణి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో సోలార్ వాటర్ హీటర్లు పనిచేయక చన్నీటి స్నానం చేయాల్సి వస్తోంది. అసలే తిర్యాణిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో సోలార్ హీటర్లు మరమ్మతులు చేయించి వేడినీటిని అందించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు. అలాగే మంగి, చెలిమెల, సింగాపూర్, రొంపల్లి ఆశ్రమ పాఠశాలల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
మరమ్మతుకు నోచుకోని బోరు..
సిర్పూర్(టి)(ఆంధ్రజ్యోతి): సిర్పూర్(టి) మండల కేంద్రంలోని వసతి గృహాల్లో సోలార్ హీటర్‌లు పని చేయకపోవడంతో విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వార్డెన్ కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేస్తున్నారు. వసతి గృహంలో బోరు కూడా పని చేయకపోవడంతో వృఽథాగా పడి ఉంది.
విద్యార్థులకు వణికిస్తున్న చలి
లింగాపూర్/జైనూర్: లింగాపూర్, జైనూర్ మండలంలోని మారుమూల గ్రామాల్లోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను చలి వణికిస్తోంది. మూడు రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ కావడంతో జైనూర్ మండలంలోని పోచ్చంలలొద్ది, పానపటార్, సోనాపూర్, మార్లవాయి, రాసిమెట్ట, కేజీబీవీ, లింగాపూర్ మండలంలోని కేజీబీవీ, కంచంన్‌పల్లి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు వేడినీటి యంత్రాలు లేక చల్లటి నీటితోనే స్నానాలు చేస్తున్నారు. చలి నుంచి రక్షణకు బ్లాంకెట్‌లు పంపిణీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.