Share News

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - May 06 , 2025 | 11:19 PM

నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌వెంకటస్వామి అన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం
తాండూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వినోద్‌వెంకటస్వామి

- బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌వెంకటస్వామి

తాండూర్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం జై బాబు, జై భీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా తాండూర్‌ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాండూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరు రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమయంలో అయినా తన ఇంటి తలుపు తట్టి సమస్యలను విన్నవించవచ్చని తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ కో ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గోవర్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ జంగ రాఘవరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రజిత, టీపీసీసీ సభ్యుడు శంకర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నియోజవకర్గాన్ని అభివృద్ధి చేస్తా

కన్నెపల్లి (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం కన్నెపల్లి మండలంలో పర్యటించారు. సుర్జాపూర్‌ గ్రామంలో రూ. 1.20 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును, ఎల్లారంలో రూ. 1.60 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. జన్కాపూర్‌ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కన్నెపల్లి, భీమిని మండలాలకు చెందిన 20 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్లారం గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కన్నెపల్లి మాజీ జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఎమ్మెల్యే ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌, ఎంపీడీవో శంకర్‌, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మాధవరపు నర్సింగరావు, కన్నెపల్లి, భీమిని మండలాధ్యక్షులు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ క ళాశాలల్లో నాణ్యమైన విద్య

బెల్లంపల్లి (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో డిగ్రీ, ఇంటర్మీడియట్‌ అడ్మిష్మన్ల పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు.ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో పూర్తిస్థాయి వసతులు ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దోస్తు వెబ్‌సైట్‌ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ కాంపెల్లి శంకర్‌; అద్యాపకులు తిరుపతి, ప్రవీణ్‌కుమార్‌, గజెల్లి మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:19 PM