నేర రహిత సమాజ స్థాపనే లక్ష్యం
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:27 PM
నేరరహిత సమాజ స్థాపనే లక్ష్యమని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు.
- బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
మందమర్రిటౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): నేరరహిత సమాజ స్థాపనే లక్ష్యమని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. గురువారం మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కాలినడకన చెంచు కాలనీ, విద్యానగర్ కాలనీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాలు విక్రయించే వారిపై నిఘా ఉంటుందన్నారు. అక్రమంగా మత్తు పదార్థాలు, గంజాయి తరలించినా, విక్రయించినా, సేవించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాలలు, పాఠశాలల్లో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఆటో డ్రైవర్లు, ద్విచక్రవాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. అనంతరం పాత బస్టాండ్ నాకా బందీ కార్యక్రమం నిర్వహించి నంబరు ప్లేట్లు లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రాజశేఖర్, ప్రవీణ్, ఆంజనేయులు, అదనపు ఎస్‌ఐ శ్రీనివాస్, పోలీసులు పాల్గొన్నారు.