తుది విడత ప్రచారానికి తెర
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:04 AM
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడింది. సాయంత్రం ఐదు గంటలకే మైక్‌లన్నీ మూగబోయాయి. ఇప్పటికే జిల్లాలో తొలి, మలి విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
- ప్రలోభాలతో ఎర
- పల్లెల్లో మూగబోయిన మైకులు
- రేపే మూడో విడత పంచాయతీ పోలింగ్
ఆసిఫాబాద్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడింది. సాయంత్రం ఐదు గంటలకే మైక్‌లన్నీ మూగబోయాయి. ఇప్పటికే జిల్లాలో తొలి, మలి విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆరు రోజుల పాటు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు, వారి బంధుమిత్రులు మద్దతు ఇచ్చిన ప్రధాన పార్టీల నాయకులు చివరి మూడు రోజులు గెలుపు తమ భుజస్కందాలపై వేసుకొని ముమ్మరం ప్రచారం చేసి సోమవారం సాయంత్రంతో ప్రచారాలు ఆపేశారు. ఈనెల 17న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా, అంతకుముందు మిగిలిన ఒకే ఒక చివరి రోజు ప్రధాన రాజకీయ పార్టీలు తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహలు పన్నుతున్నారు. నాలుగు మండలాల్లో 108 గ్రామపంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా, మరో రెండు పంచాయతీలో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 104 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో మొత్తం 104 సర్పంచ్ స్థానాలకు 377 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 938 వార్డు స్థానాల్లో 186 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 752 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 2098 మంది బరిలో ఉన్నారు.
ప్రలోభలకు ఎర..
జిల్లాలో తుది విడతలో ఎన్నికలు జరుగుతున్న అన్ని గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రధాన అస్ర్తాలైన డబ్బు, మందు, విందు ప్రలోభాల పర్వానికి తెర లేపారు. ఆయా మండలాల్లో ఎన్నికల ప్రచారం ముగిసిన క్షణం నుంచే ఓటుకు నోటిచ్చే కీలక ప్రక్రియ అమలుకు బూత్‌లు, వార్డుల వారీగా జాబితాలను సిద్ధం చేసుకొని వీటికనుగుణంగా తమతమ పార్టీల అభిమానులు, వారి కుటుంబాలకు అందజేసే కార్యక్రమం గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థులు రూ.200నుంచి రూ.500వరకు ఇస్తుండగా, పెద్ద పంచాయతీల్లో ఒకరిద్దరూ రూ.500నుంచి రూ.1000వరకు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు జరిగే మండలాల్లో సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసే సమయానికి కొంచెం ముందుగానే మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు సిబ్బందితో సీల్ వేయించారు. తిరిగి 48గంటల అనంతరం ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాక తిరిగి తెరుచుకునే వీలుంటుందని చెబుతున్నారు. కాగా ముందు జాగ్రత్తలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు మద్యంను ముందే రహస్య ప్రాంతాలకు తరలించుకున్నారు.
- ఒప్పందాలు.. హామీలు గుప్పిస్తూ..
కాగజ్‌నగర్ (ఆంధ్రజ్యోతి): మూడో విడత పంచాయతీ ఎన్నికలు కాగజ్‌నగర్ మండలంలో ఈ నెల 17న నిర్వహించనున్నారు. సోమవారం ప్రచార పర్వ ముగిసింది. ప్రచారం చివరి రోజు అభ్యరులు హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. తమ గ్రామానికి నీటి సమస్య ఉందని తమకు ఎట్టి పరిస్థితుల్లో నీటి సమస్యను తీర్చే నాయకుడికే పట్టం కడుతామని గ్రామస్థులు తెగేసి చెప్పారు. ఓ పార్టీకి చెందిన నాయకుడు తమ అభ్యర్థిని గెల్పిస్తే తప్పకుండా వారం రోజుల్లోనే కీలక సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. ఈ విషయంలో గ్రామస్థులు తమకు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలని కోరారు. బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చారు. చివరి రోజు ప్రచారంలో ఓటర్లు తమ గ్రామ సమస్యలను ఎలా పరిష్కరిస్తావు..? తమకు హామీ ఇవ్వాలని మరి కొన్ని గ్రామాల్లో అభ్యర్థులను అడగటం విశేషం. కాగజ్‌నగర్, అందవెల్లి, బోడపల్లి, భట్టుపల్లి, రాస్పెల్లి, కొత్తసార్సాల, అంకుసాపూర్, బురదగూడ, మోసం, గన్నారం, కడంబా, మాలిని, చింతగూడలో ప్రచారాన్ని అభ్యర్థులు నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వివిధ గ్రామాల్లో ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. తమ మద్దతుదారులను గెలిపించేందుకు అన్ని పార్టీల నాయకులు వ్యూహాలను వేస్తున్నారు. కొన్ని పార్టీల నాయకులు ఏకంగా ద్వితీయా శ్రేణి నాయకులను డబ్బులతో కొనేస్తున్నారు. ఎలాగైన సర్పంచి పదవి దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కొంత మంది స్వతంత్ర అభ్యర్థులకు కూడా డబ్బుల ఎర చూయిస్తు బేరసారాలు చేస్తున్నారు. 28 గ్రామ పంచాయతీల్లో రేగులగూడ, చింతగూడ ఏకగ్రీవం కాగా, 26 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహించే సిబ్బందికి కాగజ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం షామియానా, కుర్చీలు, ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.