భక్తజన సంద్రంగా గూడెం గుట్ట
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:15 PM
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక పౌర్ణమి మహాజాతర కన్నుల పండువగా జరిగింది.
- వైభవంగా కార్తీక పౌర్ణమి మహా జాతర
- సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు
- తరలివచ్చిన భక్తులు
- పోలీసుల భారీ బందోబస్తు
దండేపల్లి నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక పౌర్ణమి మహాజాతర కన్నుల పండువగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉదయం నుంచి భక్తులు కుటుంబసమేతంగా దేవస్థానానికి తరలివచ్చి సత్యదేవుడిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో నిండింది. ముందుగా గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించి, కార్తీక దీపారాధన చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో గుట్ట కింద నుంచి ఘాట్‌రోడ్డు ద్వారా భక్తులు వెళ్లే మార్గంలో షామియానాలు, చల్లని తాగునీరు ఏర్పాటు చేశారు. భక్తులు దర్శనానికి ఇబ్బంది కలగకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. వేద పండితులు, అర్చకులు స్వామి వారికి నిత్య అభిషేకాలు, పంచామృత అభిషేకం, మహాహారతి, మంత్ర పుష్పం, మహాపూర్ణాహుతి నిర్వహించారు.
- మొక్కులు చెల్లించుకున్న భక్తజనం
మహిళలు భక్తిశ్రద్ధలతో దేవాలయాల్లో కార్తీక పూజలు నిర్వహించారు. సత్యనారాయణస్వామి, అయ్యప్పస్వామి, సాయిబాబా తదితర ఆలయాలను సందర్శించి కార్తీక ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ప్రాంగణంలో రాగి చెట్టు వద్ద భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
- సత్యదేవుడిని దర్శించుకున్న ప్రముఖులు..
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గూడెం దేవాలయంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు దంపతు లు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ దంపతులు కార్తీక వ్రతాలను ఆచరించి, సత్యదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా అదనపు న్యాయమూర్తి నారాయణ, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఏసీపీ ప్రకాష్ సత్యదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.
- సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
సత్యనారాయణ స్వామి ఆలయంలో సుమారు 1300లకుపైగా దంపతులతో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. దేవస్థానం ప్రధాన ఆలయంలో, కింది వ్రత మండపం లోనే కాకుండా మరో వ్రత మండపం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తి శ్రద్ధలతో సామూహి క వ్రతాలు ఘనంగా నిర్వహించారు.
- భారీ పోలీసు బందోబస్తు
గూడెం గుట్టపై ఎటువంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ డి రమణమూర్తి, దండేపల్లి ఎస్‌ఐ తహసీనోద్దీన్ ఆధ్వర్యంలో దేవాలయం, గోదావరి తీరం, ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు అధికారులు పర్యవేక్షించారు. గోదావరి తీరం వద్ద గజ ఈతగాల్లను కూడా ఏర్పాటు చేశారు.
- అయ్యప్ప మాలధారణ..
గూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో సుమారు 450 మంది భక్తులు ఆలయానికి చేరుకొని ఆలయ వ్యవస్థాపకులు గురుస్వామి చక్రవర్తులు పురుషోత్తమచార్యులతో మాలధారణ స్వీకరించారు. అయ్యప్ప స్వాముల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.