Share News

పంటల నమోదులో సాంకేతికత

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:58 AM

జిల్లాలో రైతుల వారీగా పంట నమోదు (డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాటు విధివిధానాలను ఖరారు చేసింది.

పంటల నమోదులో సాంకేతికత

- మొబైల్‌ యాప్‌లో పంటల వివరాలు నమోదు

- ప్రతీ క్లస్టర్‌లో రెండు వేల ఎకరాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే

వాంకిడి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల వారీగా పంట నమోదు (డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాటు విధివిధానాలను ఖరారు చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి మొబైల్‌ యాప్‌లో ఫొటోలతో సహా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతీ క్లస్టరులో రెండువేల ఎకరాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయాలని ఆదేశాలు జారీచేసింది. క్లస్టర్‌ పరిధిలో పురుష వ్యవసాయ విస్తరణ అధికారులు రెండు వేల ఎకరాలు, మహిళా ఏఈవోలు 1800 ఎకరాలు డిజిటల్‌ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సీజన్ల వారీగా ఏటా ప్రభుత్వం పంటల సమగ్ర సర్వే చేస్తుంది. సంబంధిత వ్యవసాయ సిబ్బంది పంట పొలాలను సందర్శించకుండా రైతులను అడిగి వివరాలు సేకరిస్తుండడంతో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ సర్వే చేయాలంటే తప్పనిసరిగా పంట పొలాన్ని విస్తరణఅధికారులు సందర్శించాల్సి ఉంటుంది. రైతుల వారీగా ప్రతీ సర్వే నంబరు సందర్శించడం కష్టం అవుతుందన్న భావంతో గతేడాది మాదిరిగానే ఈ సీజన్‌లోనూ ప్రయోగ్మకంగా కొన్ని గ్రామాల్లో డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ సర్వే చేస్తూ మిగిలిన గ్రామాల్లో పాత పద్ధతిలోనే సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా 4.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.

- నమోదు ఇలా...

ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్‌ ఇస్తుండడంతో వరిలో ఏ విత్తన రకం వేశారనేది తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. రైతు పేరు, ఆధార్‌ నంబరు, మొబైల్‌ నంబరు నమోదు చేయాలి. రైతుల మొబైల్‌లో ఎన్ని ఎకరాల్లో పంట వేశారనే సమాచారం మెసేజ్‌ రూపంలో చేరేలా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు సర్వే నంబరు వారీగా పంట పొలాన్ని సందర్శించి వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. పంట సాగు లేకపోతే నో క్రాప్‌ అని నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేవాలు జారీ చేసింది. అక్టోబరు 25 నాటికి క్రాప్‌ బుకింగ్‌ పూర్తి చేసి 27న గ్రామపంచాయతీల్లో వివరాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. పంటల నమోదులో తప్పలుంటే ఏఈవో దృష్టికి తీసుకెళ్లాలి. మార్పులు, చేర్పుల అనంతరం నవంబరు 5న తుది జాబితా ప్రదర్శిస్తారు.

- గడువులోగా పూర్తి

గోపికాంత్‌ - మండల వ్యవసాయ అధికారి

ప్రభుత్వ ఆదేశాల మెరకు గడువులోగా క్రాప్‌ బుకింగ్‌ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. నిబంధనల మేరకు ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు సమాచారం అందించాము. ఇప్పటికే ఏఈవోలు మండలంలో క్రాప్‌ బుకింగ్‌ సర్వే చేస్తున్నారు. గడువులోగా క్రాప్‌ బుకింగ్‌ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.

Updated Date - Sep 16 , 2025 | 12:58 AM